Revenue Employees Association: ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, సరెండర్ లీవులు, సెలవు కాలపు చెల్లింపుల బకాయిలను.. ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయలేదని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా బకాయిలను ఏప్రిల్ 30 నాటికి చెల్లిస్తామని సీఎం ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదన్నారు. విజయవాడలో ఆదివారం అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.
రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన చర్చించినట్లు సమావేశం అనంతరం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను ఆమోదించినట్లు పేర్కొన్నారు. కుటుంబ అవసరాల కోసం రూ.లక్షల్లో అప్పులు చేసి నానా ఇబ్బందులు పడుతున్నామని.. తాము దాచుకున్న నగదు మంజూరుకు ఇప్పటికైనా సీఎం చొరవ తీసుకోవాలని వారు కోరారు.
‘‘తగినంత మంది సిబ్బంది లేక రెవెన్యూ ఉద్యోగులు పని భారంతో సతమతమవుతున్నారు. మౌలిక వసతుల లేమి, నిధుల కొరత పెనుసవాళ్లుగా మారాయి. కనీస సౌకర్యాలైనా లేని కొత్త జిల్లా, డివిజన్ కార్యాలయాలు అధ్వానంగా ఉన్నాయి. కొత్త జిల్లాలకు అరకొర సిబ్బందిని కేటాయించారు. ఈ పరిస్థితుల్లో ప్రతి వారం పురోగతిని ఆశించడం సరి కాదు’’ అని పేర్కొన్నారు.