రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారమై సీఐడి తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలంటూ... తుళ్లూరు మండలం విశ్రాంత తహశీల్దార్ అన్నె సుధీర్ బాబు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ ఈ మేరకు తీర్పు ఇచ్చారు. సీఐడీ నమోదు చేసిన కేసులో దర్యాప్తు జరగాల్సిందేనన్నారు. ప్రాథమిక దశలో దర్యాప్తును నిలురించకూడదని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరపాల్సి ఉందని... పిటిషన్ను కొట్టేయాలని పోలీసుల తరఫు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ రెడ్డి చేసిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఈ మేరకు తీర్పునిచ్చారు.
అసలేం జరిగింది..??
ఎస్సీ,ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూములను కొందరికి కట్టబెట్టిన వ్యవహారంలో అప్పటి తహశీల్దార్ సుధీర్ బాబు కీలక పాత్ర పోషించారనే ఆరోపణతో అందిన ఫిర్యాదు ఆధారంగా... సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై నమోదు చేసిన కేసు కొట్టేయాలని సుధీర్ బాబు హైకోర్టును ఆశ్రయించగా.. దర్యాప్తుపై న్యాయస్థానం స్టే విధించింది. ఆ ఉత్తర్వుల పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. సుధీర్ బాబు పిటిషన్పై విచారణ జరిపి త్వరగా తేల్చాలని హైకోర్టును ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఇటీవల విచారణ జరిపి తీర్పు వెల్లడించారు.