విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలో నూతన సంవత్సర ఆహ్వాన వేడుకలకు.. ఎలాంటి అనుమతులు లేవని కమిషనర్ బి. శ్రీనివాసులు తెలిపారు. కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా.. ప్రశాంత వాతావరణంలో ఇళ్ల వద్దనే వేడుకలు జరుపుకోవాలని సూచించారు. డిసెంబరు 31వ తేదీ రాత్రి బహిరంగ ప్రదేశాల్లో వేడుకల నిర్వహణపై.. ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. కరోనా రెండో దశ, యూకే నుంచి వచ్చిన వారిలో కొందరికి వైరస్ సోకడం, నూతన స్ట్రెయిన్ విజృంభణ కారణంగా.. ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లకు తావు లేకుండా.. ముఖ్యమైన ప్రదేశాల్లో పోలీసు గస్తీ, బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సీపీ ప్రకటించారు. బందరు రోడ్డులో జనాలు గుమిగూడటం, రోడ్లపై కేక్ కట్ చేయడం, ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బంది కలిగించడం నిషేధించినట్లు తెలిపారు. వ్యాపార సంస్థలు, దుకాణాలు రాత్రి 10 గంటలకు మూసివేయాలని.. హోటళ్లు, ఫంక్షన్ హాళ్లతో పాటు వివిధ సంస్థల్లో జరిగే నూతన సంవత్సర కార్యక్రమాలకూ అనుమతి లేదన్నారు. మద్యం దుకాణాలు రాత్రి 8 గంటల వరకే తెరిచి ఉంచాలని.. బార్ అండ్ రెస్టారెంట్లు రాత్రి 11 గంటల వరకు పని చేస్తాయని వెల్లడించారు. ప్రార్థనా మందిరాల్లోనూ.. కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించే విధంగా నిర్వహకులు చర్యలు తీసుకోవాలని కోరారు.