CPS EMPLOYEES: ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నప్పటికీ రాష్ట్రంలో సీపీఎస్ ఉద్యోగులను ఇంకా అరెస్టులు చేస్తున్నారని ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు అప్పలరాజు ఆక్షేపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దృష్ట్యా చలో విజయవాడ కార్యక్రమాన్ని విరమించుకుంటున్నట్టు నిన్ననే ప్రకటన జారీ చేసినట్టు తెలిపారు. సీపీఎస్ ఉద్యోగులను ఎక్కడికక్కడ బైండోవర్‌లు చేసి పోలీసు స్టేషన్లకు తీసుకెళ్లడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. సెప్టెంబరు 1ని సీపీఏఎస్ ఉద్యోగులు ఏటా చీకటిదినంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. మరో సంఘం చేసిన ప్రకటనల వల్లే శాంతిభద్రతల సమస్య తలెత్తిందన్నారు. పోలీసుల అనుమతి లేకుండా ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని నిర్వహించబోమని డీజీపీకి హామీ ఇస్తున్నామని చెప్పారు. పోలీసులు తీసుకెళ్లిన సీపీఎస్ ఉద్యోగులను తక్షణమే విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నామని అప్పలరాజు అన్నారు.
చలో విజయవాడ కార్యక్రమం వాయిదా వేసినా.. ఉద్యోగులకు నిర్బంధాలు తప్పడం లేదు. అడుగడుగునా ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలను పోలీసులు నిర్బంధించారు. పార్వతీపురంలో ఉదయపు నడకకు వెళ్లిన వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. పాఠశాలలకు వెళ్లాలని చెబుతున్నా వినకుండా.. సుమారు 3గంటల పాటు స్టేషన్ ఆవరణలో ఉంచారు. సెప్టెంబర్ 1న ఆందోళనలు చేయమని.. రాతపూర్వకంగా రాసి ఇవ్వాలని పోలీసులు ఒత్తిడి చేశారని గురువులు వాపోయారు.
తిరుపతి జిల్లా నాయుడుపేట స్టేషన్ ఎదుట టీచర్లు ధర్నా చేపట్టారు. తమ నాయకుడు బాలసుబ్రహ్మణ్యంను సోమవారం సాయంత్రం నుంచి పోలీసుస్టేషన్‌లోనే ఉంచారంటూ ఆందోళనకు దిగారు. దీంతో స్టేషన్ బెయిల్‌పై ఆయన్ను విడుదల చేశారు. నెల్లూరులోనూ అదే పరిస్థితి. టీచర్లను చిన్నబజార్ స్టేషన్‌లో ఉంచడంతో.. బహుజన ఉపాధ్యాయ సంఘం నేతలు నిరసన తెలిపారు. ఉద్యమం వాయిదా వేసినా నిర్బంధాలేంటని ప్రశ్నించారు.