అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతమైన ప్రాంతాలు.. గతంలో ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. అలా ఉంటే..ప్రాంతీయ అసమానతలు తలెత్తుతాయన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో..గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం..3 రాజధానుల అవసరం ఉందని వివరించారు. పాలన రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి.., న్యాయరాజధానిగా కర్నూలును చేయాలని ప్రభుత్వం భావిస్తోందని స్పష్టం చేశారు. వికేంద్రీకరణ కీలకమైన అంశంగా ప్రభుత్వం భావిస్తోందని గవర్నర్ వివరించారు.
ఒకే ప్రదేశంలో అభివృద్ధిని కేంద్రీకరిస్తే.... అస్థిరత, ప్రాంతీయ అసమతుల్యతకు దారితీస్తుందని గతం చెబుతోంది. వికేంద్రీకరణ ద్వారా.... విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలా చేస్తే.... అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి దోహదపడుతుందని ప్రభుత్వ అభిప్రాయం. ఫలితంగా.... విద్య, వైద్యారోగ్య, సాగు, సంక్షేమ పథకాలను అన్ని వర్గాల ప్రజలకూ చేరవేసేందుకు సులువు అవుతుంది. - బిశ్వభూషణ్ హరిచందన్, గవర్నర్
రాష్ట్రంలో ఇటీవల శాంతి భద్రతల్ని దెబ్బతీసేలా కొన్ని ఘటనలు జరిగాయని గవర్నర్ వ్యాఖ్యానించారు. కుట్రలు సఫలీకృతం కాకుండా ప్రభుత్వం అడ్డుకోగలిగిందన్నారు.