పోలీసుల చేతిలో చిత్ర హింసలకు గురై మృతిచెందిన మరియమ్మ శవానికి రీపోస్టుమార్టం నిర్వహించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రగతి శీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ సంధ్య డిమాండ్ చేశారు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు మండల పోలీస్స్టేషన్లో దొంగతనం కేసులో అరెస్టయి పోలీసుల చిత్రహింసలతో మరియమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే.
మృతురాలి కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సంధ్య పేర్కొన్నారు. తన బృందంతో అడ్డగుడూరు పోలీస్ స్టేషన్, గోవిందాపురం చర్చి ఫాదర్ను కలిసి నిజనిర్ధరణ జరిపారు. అనంతరం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో పీఓడబ్ల్యూ (POW), ఏఐకేఎంఎస్ (AIKMS), ఐఎఫ్టీయూ (IFTU), పీడీఎస్(PDSU), పీవైఎల్ (PYL) ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
మరియమ్మ మృతికి కారణమైన పోలీసులను, చర్చి ఫాదర్ను కఠినంగా శిక్షించాలి. మృతురాలి కుటుంబానికి పరిహారం కింద రూ. 50 లక్షలు ఇవ్వాలి. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. మరియమ్మ కేసు పలు అనుమాలకు తావిస్తోంది. అందుకే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.