నల్ల తామర పురుగుతో మిరపలో పూత నిలవక.. రైతులు భారీ ఎత్తున నష్టపోగా.. ఇప్పుడు కంది పంటను నల్లి వెంటాడుతోంది. దీని కారణంగా వచ్చే వెర్రి (ఎస్.ఎం.డీ-స్టెరిలిటీ మొజాయిక్ డిసీజ్) తెగులుతో కంది దిగుబడులు భారీగా పడిపోనున్నాయి. పూత నిలవడం లేదు, పిందె కావడం లేదు. అధిక శాతం పొలాల్లో ఎకరాకు ఐదు, పది కిలోల దిగుబడీ కష్టమే అని రైతులు వాపోతున్నారు. ప్రకాశం, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో తెగులు ప్రభావం అధికంగా ఉంది. ఈ తెగులు సోకితే పంట దిగుబడి పూర్తిగా పోయినట్లే అనే అభిప్రాయం శాస్త్రవేత్తల్లోనూ వ్యక్తమవుతోంది. రైతులు ఎన్ని మందులు పిచికారీ చేసినా తెగులు అదుపులోకి రావడం లేదు. అక్టోబరు, నవంబరులో కురిసిన భారీవర్షాలతో పలుచోట్ల నీరు నిలిచి కంది పైరు కొంత దెబ్బతినగా, పూత రాలి మరికొంత నష్టం జరిగింది. తాజాగా నల్లి నలిపేస్తోంది. ఎకరాకు రూ.10వేల చొప్పున కౌలు, పెట్టుబడిగా రూ.10వేలు కలిపి రూ.20వేలు నష్టపోనున్నారు. మొత్తంగా చూస్తే రూ.1,104 కోట్ల మేర రైతులు కౌలు, పెట్టుబడి రూపంలో కోల్పోనున్నారు.
అనంతపురం జిల్లాలో సాధారణం కంటే 32% అధికం
రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 6.14 లక్షల ఎకరాల్లో కంది వేశారు. గతేడాది కంటే సాగు 56వేల ఎకరాలు పెరిగింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ప్రకాశం జిల్లాలో కంది సాగు చేస్తారు. తర్వాత స్థానంలో కర్నూలు నిలుస్తుంది. అయితే ఈ ఏడాది అక్కడ సాధారణ విస్తీర్ణం కంటే సాగు తగ్గింది. అనంతపురం జిల్లాలో గణనీయంగా పెరిగింది. గతేడాది 1.18 లక్షల ఎకరాల్లో సాగు చేయగా.. ఈ ఏడాది 1.83 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇది సాధారణ విస్తీర్ణం కంటే 32% అధికం. గతేడాది దిగుబడులు బాగుండటంతో వేరుసెనగ నుంచి కందికి మళ్లారు.
75%పైనే నష్టం