ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జాకీలతో ఆలయం ఎత్తు పెరిగింది... ముంపు సమస్యకు పరిష్కారం దొరికింది... - విజయవాడలో కోదండ రామాలయం

చిన్నపాటి వర్షానికి ఆ ఆలయం నీట మునిగేది. పూజలు చేసేందుకు సాధ్యపడని పరిస్థితి. ఎత్తు పెంచాలనుకుంటే మళ్లీ నిర్మించాల్సిందేనని చెప్పడంతో అలాగే వదిలేశారు. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎన్నో ఏళ్ల సమస్యకు పరిష్కారం దొరికింది. గుడి ఏ మాత్రం చెక్కుచెదరకుండా మూడున్నర అడుగుల ఎత్తు పెరిగింది. మరీ ఇదంతా ఎలా సాధ్యమైందో మనమూ చూసేద్దాం.

RAMALAYAM
RAMALAYAM

By

Published : Dec 26, 2020, 9:16 AM IST

విజయవాడ భవానీ పురంలోని హెచ్​బీ కాలనీ వాసులంతా 38 ఏళ్ల క్రితం చందాలు వేసుకుని ఈ కోదండ రామాలయాన్ని నిర్మించుకున్నారు. క్రమంగా నగరం విస్తరించటంతో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని నీరు నిలిచిపోయేది. రోడ్డు కంటే ఆలయం పల్లంలో ఉండటంతో నీరంతా అక్కడే చేరిపోయేది. ఆలయం ఎత్తు పెంచాలంటే పునఃనిర్మించడం తప్ప మరో మార్గం లేకపోవటంతో గుడిని కూల్చలేక ఇబ్బందులు పడుతూనే పూజా కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు.

ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పల్లంలో ఉన్న ఇళ్లు, అపార్టమెంట్లను జాకీల సాయంతో ఎత్తు పెంచుతున్న విషయాన్ని తెలుసుకున్న ఆలయ నిర్వాహకులు.. ఓ సంస్థ ద్వారా ఎత్తు పెంచేందుకు పనులు ప్రారంభించారు.

గుడి పునాది నుంచి చుట్టూ ఒక్కో పిల్లర్ కోసి వందల జాకీలు ఏర్పాటు చేసి... సమాంతరంగా ఎత్తు పెంచారు. ఆలయం మధ్యలో గర్భగుడికి ఎలాంటి ఆటంకం లేకుండా.. జాకీలు అమర్చి పైకి లేపారు. నిపుణులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ..ఎత్తు పెరిగిన తర్వాత ఏర్పడిన ఖాళీ ప్రదేశంలో ఇటుకలతో గోడ కట్టారు. నెల వ్యవధిలోనే మూడున్నర అడుగుల ఎత్తు పెంచి.. పనులన్నింటీని పూర్తి చేశారు. దీనికంతటికీ 18 లక్షలు మాత్రమే ఖర్చైందని.. దాతల సహకారంతో కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు.

ఆలయ ముఖమండపం నిర్మాణానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు 44 లక్షల నిధులను ప్రభుత్వం ద్వారా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆలయాన్ని ఆధునీకరించాక గర్భగుడిలో విగ్రహాలను పునఃప్రతిష్ట చేస్తామని చెబుతున్నారు.జాకీలతో భవనాల ఎత్తు పెంచే సాంకేతికత మంచి సత్ఫలితాలను ఇస్తోందని.. తక్కువ ఖర్చుతో ఆశించిన ప్రయోజనం నెరవేరటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జాకీల సాయంతో ఎత్తుపెరిగిన ఆలయం

ఇదీ చదవండి:వాణిజ్య వివాదాల పరిష్కారానికి ఆన్‌లైన్‌ ఫిర్యాదు వ్యవస్థ

ABOUT THE AUTHOR

...view details