ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రక్షా బంధన్.. ఈ తీయని వేడుక ఎలా మొదలైందో తెలుసా - రాఖీ ప్రత్యేకకథనం

raksha bandhan 2022.. రాఖీ అంటే రక్షణనిచ్చే బంధం. సోదరుడు సుఖంగా ఉండాలని సోదరి రక్షాబంధనాన్ని కడుతుంది. సోదరికి జీవితాంతం రక్షగా ఉంటానని సోదరుడు అండగా నిలబడతాడు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలకు చిహ్నమైన ఈ వేడుక శ్రావణమాసంలో పౌర్ణమిరోజు జరుపుకుంటారు. ఈ తీయని వేడుక ఎలా మొదలైందో తెలిపే కథలు బోలెడున్నాయి..

rakhi
rakhi

By

Published : Aug 12, 2022, 6:01 AM IST

raksha bandhan 2022.. రాఖీ, రక్షాబంధన్‌, రాఖీపౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి. అంటే జులై-ఆగస్టు నెలల్లో వస్తుంది. మొదట్లో ఈ వేడుకని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలకు చెందిన భారతీయులే జరుపుకునేవారు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలూ చేసుకునే పండగైంది. పురాణాలు, చరిత్రలో కూడా రక్షాబంధన విశేషాలున్నాయి.

raksha bandhan stories.. ఇంద్రుణ్ని విజేతను చేసిన రక్ష:దేవతలకు, రాక్షసులకు జరిగిన యుద్ధంలో దేవతలరాజు ఇంద్రుడు ఓటమిపాలవుతాడు. చావుభయంతో ఉన్న భర్త ఇంద్రుడికి శచీదేవి పూజలో ఉంచిన రక్షను కడుతుంది. తర్వాత యుద్ధానికి వెళ్లిన ఇంద్రుడు ఘన విజయం సాధించి ముల్లోకాలనూ ఏలుతాడు. అలా శచీదేవి వల్ల ప్రారంభమైన రక్షాబంధన ఆచారం.. అన్నాచెల్లెళ్ల పండగగా మారి నేటికీ కొనసాగుతోంది.

బలి చక్రవర్తి బాధ్యతకు గుర్తు:ఒకానొక సందర్భంలో బలి చక్రవర్తి కోరిక మేరకు విష్ణుమూర్తి పాతాళంలో ఉండిపోతాడు. లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రక్షను కట్టి తన భర్తను ఇమ్మని వేడుకుంటుంది. లక్ష్మిని చెల్లెలిగా భావించిన బలి.. విష్ణువుని లక్ష్మికి అప్పగిస్తాడు. ఈ కథ చెల్లెలి కోరికను తీర్చే అన్న బాధ్యతకు నిదర్శనం.

ఇతిహాసాల్లో రక్షాబంధం:శిశుపాలుణ్ని శిక్షించేందుకు శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని సంధిస్తాడు. ఆ సమయంలో కృష్ణుని చూపుడు వేలు తెగి రక్తం కారుతుంది. వెంటనే ద్రౌపది తన చీరకొంగు చించి కట్టుకడుతుంది. అందుకు కృతజ్ఞతతో కృష్ణుడు ఎల్లవేళలా నీకు అండగా ఉంటానని మాటిస్తాడు. అన్నట్టే.. దుశ్శాశనుడు ఆమె చీరను లాగినప్పుడు చీరలిచ్చి ఆదుకుంటాడు. ఈ కథ చెల్లెని పట్ల అన్న బాధ్యతను గుర్తు చేస్తుంది.

మతాలకతీతమైన బంధం:గ్రీకు యువరాజు అలెగ్జాండర్‌ భార్య రోక్సానా. ఆమె తక్షశిల రాజు పురుషోత్తముడిని అన్నగా భావించేది. అలెగ్జాండర్‌ 320లో భారతదేశంపై దండెత్తాడు. పురుషోత్తముడు అలెగ్జాండర్‌ని ఎదుర్కోడానికి సిద్ధపడతాడు. అతని పరాక్రమం గురించి తెలిసిన రోక్సానా రాఖీకట్టి, పతి భిక్ష పెట్టమంటుంది. పురుషోత్తముడు అలెగ్జాండర్‌ను ఓడించినా, రోక్సానా కోరిందని చంపకుండా వదిలేస్తాడు. ఈ ఉదంతం అన్నాచెల్లెళ్ల అనురాగానికి చిహ్నంగా తోస్తుంది.

మరెన్నో బంధాలు:ఇంకా.. మొఘలాయిలు ఏలుతున్న సమయమది. చిత్తోడ్‌ రాజ్యానికి చెందిన కర్నావతి అనే రాణి మొగల్‌ చక్రవర్తి హుమాయూన్‌కి రాఖీని పంపి సంధి కోరిందని చరిత్ర చెబుతోంది.

1905లో బెంగాల్‌ విభజన సందర్భంలో విశ్వకవి రవీంద్రనాథ్‌టాగోర్‌ హిందూ ముస్ల్లింలకు పిలుపునిచ్చారు. వారి ఐక్యతని చాటుతూ ముస్లిం స్త్రీలు, ఎందరో హిందూ సోదరులకు రక్షాబంధనాన్ని కట్టారు.

ఈ వేడుక అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల అనురాగానికి అద్దం పడుతుంది. ఈ పండగను నేపాల్‌, థాయిలాండ్‌, కెనడా, బ్రిటన్‌ దేశాలలో కూడా జరుపుకుంటారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details