కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్డౌన్ కారణంగా వలస కార్మికులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. తినడానికి ఏమీ లేక పస్తులుండే పరిస్థితి ఏర్పడింది. అలాంటి వారి కోసం విజయవాడలో రాజ్ పురోహిత్ మిత్ర బృందం 21 రోజులపాటు అన్నదాన కార్యక్రమం చేపట్టి మానవత్వం చాటుకుంది. నగరంలోని పాతబస్తీ మార్కెట్‌లో సుమారు 300 మందికి పైగా వలస కార్మికులు పని చేస్తున్నారు. వారికి రోజుకు రెండు పూటలా నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమం సజావుగా జరిగేటట్లు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటూ పోలీసులు సంఘీభావం ప్రకటించారు. ఎటూ పోలేక రహదారులపై నివాసముంటున్న వలస కార్మికులు తినడానికి ఏమీ లేక పస్తులుంటున్నారని పాతబస్తీకి చెందిన రాజ్ పురోహిత్ మిత్ర బృందం ప్రతినిధి సురేష్ రాజ్ పురోహిత్ పేర్కొన్నారు. అలాంటి వారికోసం 21 రోజులపాటు అన్నదాన కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ఇంకా అలాంటి వారు చాలామంది ఉన్నారని, అవకాశం ఉన్నవారు ఆహారం దొరకని వారికి అన్నదానం చేసి మానవత్వం చాటుకోవాలని కోరారు.