Rains in telangana Today: రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భాగ్యనగర వాసులను వర్షం భయం వెంటాడుతోంది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా పడుతున్న చిరుజల్లులతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో ఎక్కువ మంది ఇళ్లకే పరిమితమయ్యారు. వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన పాదచారులు, ద్విచక్రవాహనదారులు చిరు జల్లులకు తడిసిముద్దవుతున్నారు. గ్యాప్ లేకుండా పడుతున్న జల్లులకు రహదారులన్నీ చిత్తడిగా మారాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటలకు 30నుంచి 40కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఉదయం వాయుగుండంగా బలపడిందని తెలిపారు. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి రానున్న 24గంటల్లో దక్షిణ ఒడిస్సా, దక్షిణ చత్తీస్‌గఢ్ మీదుగా వెళుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.
వాగులో కారు కొట్టుకు పోయి ఇద్దరు మృతి: వేములవాడ మండలంలోని ఫాజుల్‌నగర్ వాగులో కారు కొట్టుకు పోయి ఇద్దరు మృతి చెందారు. జగిత్యాల నుంచి హైదరాబాద్‌కు నలుగురు కారులో వెళ్తుండగా వాగు ఉద్ధృతిని అంచనా వేయలేక ఈ ప్రమాదం జరిగింది. కారు మునగటంతో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరిని పోలీసులు రక్షించారు. సిరిసిల్ల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షానికి సిరిసిల్ల పట్టణ ప్రాంతమంతా జలమయమైంది.
అధికారులు నీటిని జేసీబీలతో మధ్యమానేరులోకి మళ్లిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు ప్రకటన విడుదల చేశారు. హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పరకాల చలివాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ఆత్మకూరు మండలం కటాక్షపూర్ చెరువు అలుగు పోస్తుంది. శాయంపేట మండలం జోగంపల్లి ప్రాజెక్టు చెరువులోకి భారీగా వరద నీరు చేరుతోంది.