రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిశాయి. దీంతో పలు ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దాదాపు గంట పాటు.. ఈదురుగాలులతో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వల్ల విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది.అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో భారీ వడగళ్ల వాన కురిసింది. ఎప్పుడూ లేనంతగా.. నిమ్మకాయ సైజు పరిమాణంలో వడగళ్ళు పడ్డాయి. రహదారి అంతా వడగళ్లతో నిండిపోయింది. శ్రీకాకుళం జిల్లాలో చాలాచోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. శ్రీకాకుళం, టెక్కలి పరిసర ప్రాంతాల్లో జోరువాన కురిసింది. దీంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల్లో అకాల వర్షం కురిసింది. చందర్లపాడు మండలం పొక్కునూరు, కాసరబాద, కొడవటికల్లు, కొండపేట, పున్నవల్లి పరిసర గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం పడింది. పెనుగంచిప్రోలు, వత్సవాయి మండల పరిసర గ్రామాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం పడింది.
అన్నమయ్య జిల్లాలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అకాల వర్షంతో రైల్వేకోడూరు, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, వీరబల్లి, రామాపురంలో పంట నష్టం వాటిల్లింది. సుండుపల్లి మండలంలో 500 ఎకరాల్లో మామిడి నేలరాలింది. ఈదురు గాలులతో శ్రీకాళహస్తి పట్టణ పరిసరాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. పాపినేనిపల్లిలో విద్యుత్ స్తంభాలు కూలటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఆత్మకూరు, సంగం, ఏయస్ పేట మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పొలాల్లోని వరికుప్పలు దెబ్బతిన్నాయి.