రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వారిది. రైళ్లలో రాకపోకలు సాగించే ప్రయాణికుల సామ్లాన్లను మోయడమే వీరి జీవనాధారం. దీనికోసం వీరికి ప్రత్యేకంగా యూనిఫాం సహా లైసెన్సులను రైల్వే శాఖ జారీ చేసింది.
- వారిచ్చే కొంత మొత్తమే వీరికి ఆధారం..
ఎప్పుడూ ర్వైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఉండే వీరంతా.. ప్రయాణికులకు సాయం చేస్తుంటారు. ప్రయాణికుల లగేజీ మొత్తాన్ని తలపై పెట్టుకుని.. మరికొన్నింటిని, భుజానికి తగిలించుకునే మోత మోస్తూ ప్రయాణికులను రైలు ఎక్కిస్తుంటారు. రైలుదిగిన వారినీ స్టేషన్ బయటి వరకూ తీసుకువచ్చి ఇతర వాహానాల్లో సుఖంగా వెళ్లేలా సాగనంపుతుంటారు. ఇంత చేస్తే ప్రయాణికులు ఇచ్చే కొద్ది పాటి డబ్బే వీరికి జీవనాధారం. వాటితోనే కుటుంబాన్ని పోషించుకుంటారు. కుటుంబం కడుపు నిండాలన్నా.. పిల్లల్ని బడికి పంపాలన్నా... ఇంటి అద్దెలు కట్టాలన్నా.. ప్రయాణికులు ఇచ్చే కొంతే వారికి ఆధారం.
- నిరాశే మిగిలింది...
గడచిన కొద్ది రోజులుగా లాక్ డౌన్ నుంచి క్రమంగా మినహాయింపులు రావడంతో రైలు నడపడానికి రైల్వే శాఖ పచ్చజెండా ఊపింది. ఇకపై రైళ్లు నడుస్తాయని తమ కడుపు నిండుతుందని ఎంతో ఆశపెట్టుకున్న వారికి నిరాశే మిగిలింది. కేవలం కొద్దిపాటి రైళ్లు మాత్రమే నడుస్తుండటం తక్కువ మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండంతో వీరికి ఉపాధి దొరకడం లేదు. విజయవాడ రైల్వే స్టేషన్లో 200 మంది కూలీలు ఉండగా.. కొద్ది మందికి మాత్రమే పని దొరుకుతోంది.