ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

SCR GM WITH MPs: సదుపాయాల కల్పన, పెండింగ్​ పనులు సత్వరమే పూర్తిచేయాలి: ఎంపీలు - రాష్ట్ర ఎంపీలతో ఎస్​సీఆర్ జీఎం గజానన్ మాల్యా సమావేశం

Railway GM meeting with ap state MPs
రాష్ట్ర ఎంపీలతో ఎస్​సీఆర్ జీఎం గజానన్ మాల్యా సమావేశం

By

Published : Sep 30, 2021, 5:55 PM IST

Updated : Sep 30, 2021, 7:54 PM IST

17:52 September 30

రాష్ట్ర ఎంపీలతో ద.మ.రైల్వే జీఎం సమావేశం

రాష్ట్ర ఎంపీలతో ద.మ.రైల్వే జీఎం సమావేశం

 రాష్ట్రంలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి సహా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా సమావేశం నిర్వహించారు. విజయవాడలో జరిగిన భేటీకి విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్ల పరిధిలోని పలువురు ఎంపీలు పాల్గొన్నారు. వచ్చే బడ్జెట్​లో కావాల్సిన కేటాయింపులపై ఎంపీలు జీఎంకు ప్రతిపాదనలు అందించారు. పలు కొత్త రైల్వే లైన్లు నిర్మాణం పూర్తి చేయాలని.. కొత్త రైళ్లు ఏర్పాటు చేయాలని ప్రధానంగా కోరారు. రైళ్లు , రైల్వే స్టేషన్లలో సదుపాయాల కల్పన, సమస్యలు సత్వరమే పరిష్కరించాలని ఎంపీలు కోరారు. రాష్ట్రంలో జరుగుతోన్న రైల్వే పెండింగ్ ప్రాజెక్టుల ప్రగతిపై సమావేశంలో చర్చ జరిగింది.

   రైలు క్రాసింగ్​ల వద్ద బ్రిడ్జీల నిర్మాణాల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని.. ఫలితంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఎంపీలు జీఎం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో కీలకమైన పలు కొత్త లైన్ల నిర్మాణం సహా పెండింగ్ ప్రాజెక్టులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని.. దీంతో రైళ్లు పెంచలేని పరిస్ధితి నెలకొందని తెలిపారు. రైలు స్టేషన్లలో సదుపాయాలు పెంచాలని, స్టేషన్లు గ్రేడింగ్ పెంచాలని ఎంపీలు కోరారు. కొత్త రైల్వే లైన్లు నిర్మాణాన్ని సత్వరమే పూర్తిచేయడం సహా అవసరమైన మార్గాల్లో కొత్త రైళ్లను నడపాలని కోరారు. చాలా ప్రాజెక్టులు ఏళ్ల తరబడి కొనసాగుతున్నా.. పూర్తి కావడంలేదని పలువురు ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు.  

    గడచిన రెండేళ్లలో చేపట్టిన పనులపై నివేదిక రూపంలో ఎంపీలకు జీఎం వివరించారు. పలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు ఉన్నా .. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటాగా నిధులు రాకపోవడం వల్లే పనులు పెండింగ్​లో ఉన్నాయని జీఎం తెలిపారు. కొవిడ్​ విపత్కర పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో పెండింగ్​లో ఉన్న రైల్వే ప్రాజెక్టులన్నింటినీ కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తి చేయాలని వైకాపా ఎంపీలు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఇచ్చే నిధుల విషయం సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. స్టేషన్లలో నెలకొన్న పలు సమస్యలు సత్వరమే పరిష్కరించాలని ఎంపీలు కోరారు. 

రాష్ట్ర ప్రభుత్వం వాటాను వెంటనే విడుదల చేయాలి: కనకమేడల  
ఎంపీలతో రైల్వే జీఎం సమావేశం పట్ల తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయని..రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇస్తే పెండింగ్ పనులు పూర్తి చేస్తామని జీఎం చెప్పారన్నారు. ఈ పరిస్ధితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తన వాటాను విడుదల చేయాలని సీఎంను డిమాండ్ చేశారు. కొవిడ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోవద్దని సూచించారు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ఏపీని అనాథగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  

ఆదేశాలు రాగానే రైళ్లలో రాయితీలు: గజానన్ మాల్యా  
రెండేళ్ల తర్వాత ఎంపీలతో సమావేశమై ప్రతిపాదనలు తీసుకున్నామని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా అన్నారు. ఏడాదిన్నరలో చేసిన పనులను ఎంపీలకు వివరించామన్న ఆయన..కొవిడ్​తో విపత్కర పరిస్ధితులుల్లోనూ చాలా పెండింగ్ పనులు పూర్తి చేశామన్నారు. రైల్వే లైన్లు, నిర్మాణం సత్వరం పూర్తి చేయాలని ఎంపీలు కోరినట్లు చెప్పారు. ఏపీ ప్రభుత్వం నుంచి వాటా నిధులు రావాల్సి ఉందని.. నిధులు సత్వరమే విడుదల చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపినట్లు ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాగానే పెండింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు. విజయవాడ - విశాఖ కోనసీమ లైన్, నడికుడి - శ్రీకాళ హస్తి సహా పలు లైన్లకు ఒప్పందం ప్రకారం రాష్టప్రభుత్వం నిధులు ఇవ్వని కారణంగా పనులు పూర్తి కావడం లేదన్నారు. కొవిడ్ వల్ల చాలా రైళ్లుని నడపడం లేదని.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నుంచి ఆదేశాలు రాగానే రైళ్లలో రాయితీలు అమలు చేస్తామన్నారు.

సగం మంది ఎంపీలు డుమ్మా..  
ఎంతో కీలకమైన ఈ సమావేశానికి లోక్ సభ,రాజ్య సభ ఎంపీలందరికీ ఆహ్వానాలు పంపారు. ఎంపీలంతా హాజరై వారి నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉండగా.. చాలా మంది ఎంపీలు సమావేశాన్ని తేలిగ్గా తీసుకున్నారు. సమావేశానికి కేవలం 15 మంది ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. సగం మంది ఎంపీలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. ఎంపీలిచ్చిన ప్రతిపాదనలు క్రోడీకరించిన అనంతరం ఆ నివేదికను ఆమోదం కోసం రైల్వే బోర్డుకు పంపనున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు.


 

ఇదీ చదవండి..

badvel by elections: ఓట్లు వేసేలా ఓటర్లను ప్రోత్సహించాలి: సీఎం జగన్

Last Updated : Sep 30, 2021, 7:54 PM IST

ABOUT THE AUTHOR

...view details