కొవిడ్ కారణంగా నిలిపివేసిన సాధారణ రైళ్లను తిరిగి ప్రారంభించేందుకు రైల్వేశాఖ సమాయత్తమవుతోంది. ప్రస్తుతం నడుస్తోన్న ప్రత్యేక రైళ్ల స్థానంలో అన్ని సాధారణ రైలు సర్వీసులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. టికెట్లు జారీ చేసే రిజర్వేషన్ వెబ్ సైట్లో రైలు నెంబర్లను మార్చే ప్రక్రియను రైల్వేశాఖ చేపట్టింది. దీనికోసం రైలు టికెట్ల రిజర్వేషన్ వ్యవస్థలో డేటా అప్ డేట్ చేస్తున్నారు. దీనివల్ల వారం రోజులపాటు అర్ధరాత్రి సమయాల్లో రిజర్వేషన్ సదుపాయాన్ని నిలిపివేసింది. నవంబర్ 20 వరకు.. రాత్రి 11 గంటల 30నిమిషాల నుంచి తెల్లవారుజామున 5 గంటల 30నిమిషాల వరకు రిజర్వేషన్ సేవలు నిలిపివేశారు. ఈ సమయంలో టికెట్ రిజర్వేషన్లు, కరెంట్ బుకింగ్, టికెట్ల రద్దు వంటి సేవలు అందుబాటులో ఉండవని అధికారులు తెలిపారు.
మార్పు చేసిన రైళ్ల నెంబర్లు ప్రయాణికులకు ఎస్ఎమ్ఎస్ ద్వారా.. రైల్వేశాఖ తెలియజేయనుంది. సంబంధిత రైల్వే స్టేషన్ విచారణ కేంద్రాల్లో, హెల్ప్ డెస్క్‌ల వద్ద కూడా సమాచారం తెలుసుకోవచ్చని చెప్పారు. సురక్షిత, ఆటంకాలు లేని ప్రయాణానికి అందరూ సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కోరారు. ప్రత్యేక రైళ్లలో అదనపు చార్జీలు వసూలు చేస్తుండగా... ఇకపై ఆ సమస్య ఉండదని చెప్పారు . వృద్ధులు, వికలాంగులు, పాత్రికేయులు సహా ఇతర రంగాల్లోని నిర్దేశిత విభాగాల వారికి టికెట్ల ఛార్జీల్లో రాయితీలు వర్తిస్తాయని రైల్వేశాఖ తెలిపింది.