విజయవాడలో దారుణ హత్యకు గురైన యువ పారిశ్రామికవేత్త రాహుల్ హత్య కేసు విచారణలో పోలీసులు దూకుడు పెంచారు. ప్రధాన నిందితుడు కోగంటి సత్యం కస్టడీ కోరుతూ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై ఇవాళ విచారణ జరగగా..రాహుల్ హత్య కేసులో కీలక వివరాలు రాబట్టాల్సి ఉందని పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న న్యాయస్థానం..సత్యంను 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం కృష్ణా జిల్లా జైలులో ఉన్న కోగంటి సత్యంను..గురువారం కస్టడీలోకి తీసుకోనున్నారు.
రాహుల్ హత్య.. ఆ రోజు ఏం జరిగింది ?
విజయవాడ నడిబొడ్డున కారులో మృతదేహం కలకలం సృష్టించింది. హతుడు.. పారిశ్రామికవేత్త కరణం రాహుల్ (29) అని దర్యాప్తులో తేలింది. వ్యాపార వాటాల్లో వివాదమే ఇందుకు కారణమని, వ్యాపార భాగస్వామి పాత్ర ఉందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కేసులో నలుగురు నిందితుల పాత్ర ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. వీరిని పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. మృతుడి తండ్రి రాఘవ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేశారు.
కెనడాలో చదివిన కరణం రాహుల్.. స్వదేశానికి వచ్చాక కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం చెరువు మాధవరంలో సిలిండర్ల తయారీ కంపెనీ స్థాపించారు. ఇందులో ముగ్గురు భాగస్వాములున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా పుంగనూరులో మరో కంపెనీకి శంకుస్థాపన చేశారు. పోరంకిలో వారు నివాసం ఉంటున్నారు. అత్యవసరంగా మాట్లాడాలని ఫోన్ రాగా గత నెల 19న రాత్రి 7.30 సమయంలో రాహుల్ కారులో బయటకు వచ్చారు. రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లోవారు ఫోన్ చేస్తే స్విచాఫ్ అని వచ్చింది.