ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది: రఘురామ - రఘురామ తాజా వార్తలు

రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని ఎంపీ రఘురామ అన్నారు. ఈ మేరకు సీఎం జగన్​కు లేఖ రాశారు. ఇసుక విక్రయాలకు సంబంధించిన ప్రక్రియను డిజిటైలేజేషన్ చేశారని.. అవినీతి తావులేదని ముఖ్యమంత్రి చెప్పారని కానీ.. క్షేత్రస్థాయిలో అలా కన్పించడం లేదని లేఖలో పేర్కొన్నారు.

raghurama on sand
raghurama on sand raghurama on sand

By

Published : Jul 6, 2021, 7:25 AM IST

‘ఇసుక విక్రయాలకు సంబంధించి అంతా డిజిటలైజ్‌ చేశాం. ఇక ఏ మాత్రం అవినీతి జరగదని మీరు (ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి) నమ్మకంగా చెప్పినా రాష్ట్రంలో ఇసుక బ్లాక్‌ మార్కెట్‌ దందా ఎందుకు నడుస్తున్నదో, అమ్మకాల్లో అవినీతి ఎందుకు పెరిగిపోయిందో అర్థం కావడం లేదు. ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది’ అని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. ‘రాష్ట్రంలో తొలుత ఇసుక సరఫరా బాధ్యతను గుత్తేదారుకు అప్పగించారు. కొరత తీవ్రమైంది. లభ్యత సన్నగిల్లడంతో నిర్మాణ రంగం స్తంభించింది. ఉపాధి దారుణంగా పడిపోయింది. ఈ అంశాలను నేను మీ దృష్టికి తీసుకువచ్చా. మీరు అర్థం చేసుకోకుండా నాపై కక్ష పెంచుకున్నారు. అనంతరం మీరు తీసుకొచ్చిన మరో విధానం దారుణంగా విఫలమైంది. ఇసుక తవ్వకం, అమ్మకం నుంచి సరఫరా వరకూ జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (జేపీవీఎల్‌) ప్రైవేటు కంపెనీకి ధారాదత్తం చేశారు.

ఇసుక అంశం సమస్యే కాదన్నారు..

ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ అన్ని రీచ్‌లను ఆ కంపెనీకి కట్టబెట్టింది. ఆ సంస్థ కనీసం సగం రీచ్‌ల్లోనూ తవ్వకాలు ప్రారంభించలేకపోయింది. ర్యాంపుల వద్ద దళారుల ప్రమేయం ఎక్కువగా ఉంది. రవాణా ఖర్చుల దృష్ట్యా ఒకే ధరకు ఇవ్వలేమని సరఫరాదారులు చెబుతున్నారు. డ్రైవర్‌ వెయిటింగ్‌, క్లీనర్‌, హెల్పర్‌ ఛార్జీలు అదనంగా వేస్తున్నారు. తాజాగా వచ్చిన మరో కొత్త బెడద ‘‘జగనన్న ఇళ్ల కాలనీ’’ల అవసరాలు తీరిన తర్వాతే మిగిలిన వారికి ఇసుక సరఫరా చేస్తారట. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇటీవల సమీక్ష సమావేశంలో అది పెద్ద అంశం కాదన్నట్లు మాట్లాడారు. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే జగనన్న ఇళ్ల కాలనీలకు 37 లక్షల టన్నుల ఇసుక అవసరం. వీటికి తోడు రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఎంత కావాలో అంచనా వేసుకోవచ్చు. చాలా చోట్ల ఇళ్లను ఎవరికి వారే కట్టుకోవాలని అధికారులు ప్రోత్సహిస్తున్నారంటున్నారు. తక్షణమే ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టకపోతే పట్టాలు రద్దు చేసి వేరొకరికి కేటాయిస్తామని బెదిరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధుల నుంచి రోడ్లు, ఇతర సౌకర్యాల కల్పనకు నిధులు ఇస్తున్నా, ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.1.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నా ఈ పథకానికి ‘‘జగనన్న ఇళ్ల కాలనీలు’’ అంటూ మీ పేరు పెట్టి మొత్తం ఘనతను మీరే సొంతం చేసుకోవడానికి వేసిన ఎత్తుగడను చూసి మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నా. ఇందులో కేంద్రం వాటా ఉందని చూచాయగా చెప్పినా కేంద్రం నుంచి మరిన్ని నిధులు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అలా అదనంగా వచ్చే కేంద్ర ప్రభుత్వ పథకాలకు మనం ‘‘జగనన్న’’ పేరు పెట్టుకుంటే ప్రజలు మరింత సంతోషపడతారు. మీ ఇసుక విధానాన్ని తక్షణమే మార్చుకుంటారని, రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకునేలా చేస్తారని ఆశిస్తున్నా’ అని లేఖలో రఘురామ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:High Court: సొంత రాష్ట్రంలోనే హెచ్​ఆర్​సీ కార్యాలయం ఉండాలి

ABOUT THE AUTHOR

...view details