తెలంగాణలో విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ ప్రవేశం చేయడంపై.. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. గతంలో.. పోలీసు అధికారిగా ఉన్నప్పుడు రాజకీయాలు మాట్లాడడం సరికాదని తాను ప్రవీణ్ కుమార్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి.. మనస్ఫూర్తిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు పాలిటిక్స్‌లోకి స్వాగతం పలుకుతున్నానని చెప్పారు. గొప్ప నాయకుడిగా ప్రవీణ్ కుమార్ ఎదగాలని ఆశిస్తున్నానని అన్నారు. బీఎస్పీలో చేరిన సందర్భంగా.. తనపై ప్రవీణ్ చేసిన వ్యాఖ్యలకు స్పందనగా అభిప్రాయం చెబుతున్నానని వివరించారు.
"ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ ప్రవేశం చేశారు. ఆయనకు పాలిటిక్స్‌లోకి స్వాగతం చెబుతున్నా. ఒక అధికారిగా ఉన్నప్పుడు రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని చెప్పి.. గతంలో నేను వ్యాఖ్యానించాను. కానీ.. అప్పుడే ఆర్ఎస్ ప్రవీణ్‌లో ఉన్న రాజకీయ నాయకుడిని నేను చూశాను. మాలాంటి నాయకులు మాట్లాడే మాటలు అధికారిగా ఉన్నప్పుడు అనకుండా ఉంటే బాగుంటుంది అని మాత్రమే అప్పుడు వ్యాఖ్యానించాను. ఇప్పుడు రాజకీయాల్లో పూర్తి స్థాయిలో ప్రవేశించిన ఆర్ఎస్ ప్రవీణ్‌కు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా. గొప్ప నాయకుడిగా ఎదగాలని ప్రార్థిస్తున్నా. ఆయన భావజాలంలో ఎలాంటి తప్పు లేదు. నా భావజాలం కూడా దాదాపుగా ప్రవీణ్ కుమార్ మాదిరిగానే ఉంటుంది. ప్రవీణ్ కోరుకున్నట్టే ఏనుగుపైనే రాజకీయాల్లో విహారం చేయాలని మనస్ఫూర్తిగా గుడ్ లక్ చెబుతున్నా" - రఘురామకృష్ణరాజు, నరసాపురం ఎంపీ