ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Radharani Success Story: క్రీడాదుస్తుల వ్యాపారంలో దూసుకెళ్తున్న రాధా రాణి.. నైపుణ్యాలతో పలు అవార్డులు

Radharani Success Story: విజయానికి వయసు అవరోధమా..? పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు పరిమితులుంటాయా..? లక్ష్యసాధన సాధ్యమేనా? అవును...సాధ్యమేనంటున్నారు ఓ మహిళ..! ఆమె 42 ఏళ్ల వయసులో ప్రారంభించిన దుస్తుల వ్యాపారం...35 కోట్ల టర్నోవర్ చేసే సంస్థగా ఎదిగింది..! అవార్డులూ తెచ్చి పెట్టింది..! ఇంతకీ ఎవరామె..? ఆమె విజయగాథ ఏంటో...ఓసారి చూసేద్దాం.

Radharani Success Story in sportswear business
క్రీడాదుస్తుల వ్యాపారంలో రాధారాణి విజయం

By

Published : Mar 6, 2022, 10:23 AM IST

క్రీడాదుస్తుల వ్యాపారంలో రాధారాణి విజయం

Radharani Success Story: బర్నింగ్ డిజైర్ టు డెవలప్ ఇండస్ట్రీ.. ఈ వాఖ్యం ఈమె జీవితాన్నే మార్చేసింది. వ్యాపారంలో సొంతంగా రాణించాలనే లక్ష్యంతో క్రీడా దుస్తుల వ్యాపారంలో ఎదిగి ఆదర్శంగా నిలుస్తున్నారు రాధారాణి. ఉన్నత కుటుంబంలో ఆంక్షల నడుమ పెరిగినా డిగ్రీ వరకు చదివారు. వివాహం తర్వాత.. పుదుచ్చేరిలో ఆంధ్ర పికిల్స్ పేరుతో పచ్చళ్ల వ్యాపారం.. తర్వాత హైదరాబాద్ పటాన్‌చెరువులో క్వాలిటీ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ ప్రారంభించారు. అక్కడ మంచి ఫలితాలతో.. విజయవాడలో గ్రాఫిక్స్ ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేశారు.

1991లో క్రీడాదుస్తుల వ్యాపారం ప్రారంభం

అన్నిచోట్లా విజయాలు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో.. 1991లో రాధారాణి క్రీడాదుస్తుల వ్యాపారం ప్రారంభించారు. వాలీబాల్ క్రీడాకారుల విఙ్ఞప్తితో.. వారి దుస్తులపై పేర్లు ముద్రించారు. వారు ఆ పోటీల్లో గెలిచారు. ఇక అంతే...ఆ విజయం ఆమె ఇంటి ముంగిట నిలిచింది. విజయవాడ గాంధీనగర్‌లో ఆరుగురితో కలిసి.. ఆర్.ఆర్. ఇండస్ట్రీ పేరుతో చిన్నతరహా పరిశ్రమ స్థాపించారు. ఇప్పుడు ఆ సంస్థ....35 కోట్ల టర్నోవర్ సాధిస్తోంది.

విజయవాడ, సూరంపల్లిలో యూనిట్లు

విజయవాడ, సూరంపల్లిలో.. రాధారాణి యూనిట్లు ఏర్పాటు చేశారు. ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా..ఆమె భయపడలేదు. దాని ఫలితమే..మంచి పేరూ, ఆదాయం. ఒకప్పుడు విజయవాడకే పరిమితమైన ఆర్.ఆర్. క్రీడా దుస్తులు..ఇప్పుడు విదేశాలకూ ఎగుమతి అవుతున్నాయి.

మహిళలు, విద్యావంతులకు ప్రాధాన్యం

సిబ్బందితో ప్రేమగా ఉండే రాధారాణి.. తన సంస్థలో మహిళలు, విద్యావంతులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆడపిల్లలకు రికరింగ్ డిపాజిట్ చేయించేవారు. ప్రస్తుతం R.R. ఇండస్ట్రీస్ వ్యాపార వ్యవహారాలను..ఆమె కుమారులు ప్రసన్న, వేణుగోపాల్ చూసుకుంటున్నారు.

సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి

రాధారాణి కేవలం వ్యాపారమే కాకుండా.. సేంద్రీయ వ్యవసాయంపైనా దృష్టి సారించారు. కృష్ణా జిల్లా తిరువూరు సమీపంలోని రామపట్నంలో.. అమ్మ ఆశ్రమం ఏర్పాటు చేశారు. సేవా కార్యక్రమాలు, వ్యాపార నైపుణ్యాలతో.. 1998-99లో జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్తగా అవార్డు అందుకున్నారు. 2009లో J.R.D. టాటా ఇండస్ట్రియల్ ఎస్టేట్ అసోసియేషన్ నుంచి ఉత్తమ పారిశ్రామికవేత్త అవార్డు అందుకున్నారు.

ఇదీ చదవండి:

అతివల శక్తి అవనికి చాటుతున్నారు.. ఆ రైల్వే స్టేషన్​లో అందరూ మహిళా ఉద్యోగులే!

ABOUT THE AUTHOR

...view details