జనవరి 1 నుంచి ఇంటింటికీ నాణ్యమైన రేషన్ పంపిణీ ప్రారంభమవుతుందని... అప్పటి నుంచి రేషన్ దుకాణాలన్నీ స్టాక్ పాయింట్లుగా మారతాయని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. కొత్త వ్యవస్థను విజయవంతం చేసేందుకు రేషన్ డీలర్లు అందరూ సహకరించాలని కోరారు. విజయవాడలో జరిగిన కృష్ణా జిల్లా చౌక ధరల దుకాణాదారుల సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా మంత్రి పాల్గొన్నారు.
రైతులకు విత్తనాలు, ఎరువులు సహా ఇతర వస్తువులు రేషన్ డీలర్ల ద్వారా ఇవ్వాలనే ఉద్దేశం ముఖ్యమంత్రికి ఉందని కొడాలి నాని వివరించారు. కరోనా వచ్చాక కేంద్రం ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇస్తున్నందునా.. డీలర్లకు కమీషన్ రావడంలేదని మంత్రి తెలిపారు. డీలర్లకు కేంద్రం 35 పైసల చొప్పున కమీషన్ ఇస్తామంటోందని... రూపాయి కమిషన్ ఇవ్వాలని సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారని చెప్పారు.