పాములపర్తి వెంకట నరసింహారావు... ఈ పేరు నేటితరం వారికి పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు! కానీ.. పీవీ నరసింహారావు అంటే తెలియనోళ్లు ఉండరు. నిరంతరం నిశ్శబ్దాన్ని కప్పుకుని పైకి గంభీరంగా కనిపించే పీవీ... దేశ ప్రగతికి దార్శనికుడు. తన మేథస్సుతో, ఆర్థిక సంస్కరణలతో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పట్టాలపై ఎక్కించి అపర చాణక్యుడిగా కీర్తిగడించారు. మారుమూల ప్రాతం నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
బాల్యంలోనే సాహిత్య బీజాలు...
పాములపర్తి వెంకట నరసింహారావుది వరంగల్ జిల్లా లక్నేపల్లి. 1921 జూన్ 28న రుక్మాబాయమ్మ, సీతారామారావు దంపతులకు జన్మించారు. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావుకి సంతానం లేకపోవడంతో పీవీని దత్తత తీసుకున్నారు. చిన్నప్పటి నుంచి చదువు, ఆటపాటల్లో చురుగ్గా ఉండే ఆయన బాల్యంలోనే విన్న పురాణ కాలక్షేపాలు, పౌరాణిక నాటకాలు ఆయనకు బాల్యంలోనే సాహిత్య బీజాలు నాటాయి.
బాల్యంలోనే వివాహం...
కరీంనగర్ జిల్లా వంగరలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఆయన... హన్మకొండలో మెట్రిక్యులేషన్ వరకు చదివారు. హయ్యర్ సెకండరీలో హైదరాబాద్ సంస్థానంలోనే ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. హన్మకొండ కళాశాలలో బహిష్కరణకు గురికావడం వల్ల ఓ స్నేహితుని సహాయంతో నాగ్‌పూర్ వెళ్లి ఇంటర్మీడియట్ చదివారు. పుణేలోని ఫెర్గూసన్ కళాశాలలో డిగ్రీ బీఎస్సీ పట్టాపొందారు. నాగ్‌పూర్‌లో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. పీవీ పదేళ్ల వయసులో సత్యమ్మతో వివాహమైంది. వారికి ముగ్గురు కుమారులు, అయిదుగురు కుమార్తెలు.