విజయవాడలోని అశోక్‌నగర్‌లో రాత్రి 11 గంటలు దాటగానే ఓ సైకో సంచరిస్తున్నాడు. మహిళలు, చిన్నారులు, యువతులపై దాడికి పాల్పడుతున్నాడు. రాత్రి అయితే చాలు ఇంటి నుంచి బయటకు రావటానికి అశోక్ నగర్ మహిళలు వణికిపోతున్నారు. గత వేసవిలో తలుపులు తీసి ఓ కుటుంబం నిద్రిస్తుండగా చిన్నారిపై దాడికి యత్నించినట్లు తండ్రి ఫిర్యాదుచేశారు. అప్పటి నుంచీ పగటిపూట బయట ఆడుకోవాలన్నా ఆ చిన్నారి భయపడుతోంది. పటమట పోలీస్‌స్టేషన్ పరిధిలోని అశోక్‌నగర్‌లోని చాలా ఇళ్లల్లో ఇలాంటి కథలు వినిపిస్తూనే ఉన్నాయి.
మంకీ క్యాప్, నల్లటి దుస్తులు ధరించి పట్టుకునేందుకు యత్నించేవారికి దొరక్కుండా తప్పించుకునేలా చేతులకు నూనె రాసుకుంటూ సైకో తిరుగుతున్నాడని స్థానికులు తెలిపారు. కిటికీల వద్దకు వచ్చి టార్చిలైట్ వేసి ఎవరెవరు ఎక్కడ నిద్రిస్తున్నారో చూసి కిటికీకి దగ్గరగా గొళ్లెం ఉంటే తలుపు తీసి లోపలకి ప్రవేశిస్తున్నాడని చెప్పారు. రాత్రి పూట మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు హటాత్తుగా వారిపై దూకి దాడికి పాల్పడతాడని చెబుతున్నారు. కొన్ని ఘటనలకు సంబంధించి బాధితులు పరువుపోతుందనే భయంతో బయటకు రావట్లేదని తెలిపారు.