GST hike on clothes: వస్త్రాలపై జీఎస్టీని 5 నుంచి 12శాతం పెంచడంపై విజయవాడలోని కృష్ణవేణి బట్టల మార్కెట్లో వస్త్ర వ్యాపారులు ఆందోళన నిర్వహించారు. బట్టలు అనేవి ప్రతి ఒక్కరికీ అవసరమని ఎపీ టెక్స్ టైల్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బచ్చు వెంకటప్రసాద్ అన్నారు. అందుకే కూడు, గూడు, గుడ్డ అని మన పెద్దలు చెప్పారని గుర్తు చేశారు. అటువంటి వస్త్ర రంగంపై వ్యాట్ ట్యాక్స్‌లు వేశారని అన్నారు. ఇప్పటికే వ్యాపారాలు తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.
కేంద్రం ఐదు నుంచి 12శాతానికి పెంచిన జీఎస్టీ వచ్చే సంవత్సరం జనవరి1 నుంచి అమలులోకి రానుంది. కేంద్రం నిర్ణయాన్ని వస్త్ర వ్యాపారులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బచ్చు వెంకట ప్రసాద్ వెల్లడించారు. వినియోగదారుల పై కూడా రెట్టింపు భారం పడుతుందని తెలిపారు. ఐదు శాతం ఉన్న జీఎస్టీని తగ్గించమంటే..12శాతం పెంచడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. కేంద్రం పునరాలోచన చేసి జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.