నిషేధిత గుట్కా ప్యాకెట్లు, చైనా సిగరెట్లు విచ్చలవిడిగా విజయవాడకు దిగుమతి అవుతున్నాయి. ఇక్కడి నుంచి చుట్టుపక్కల జిల్లాలకు తరలిస్తున్నారు. దిల్లీ, కర్ణాటక, ఒడిస్సా రాష్ట్రాల నుంచి అత్యధికంగా ఈ నిషేధిత సరకు తరలివస్తోంది. విజయవాడ నగరంలోని భవానీపురం, వన్‌టౌన్, సింగ్‌నగర్, శివారు ప్రాంతాల్లోని గోదాముల్లో ఈ సరకును నిలువ చేసి అక్కడి నుంచి.. చిన్న వ్యాపారులు, పాన్ డబ్బాలు, కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. గుట్కా ప్యాకెట్ల రూపంలో కాకుండా.. లూజుగా 25కేజీల చొప్పున బాక్సుల్లో ఇక్కడికి తీసుకొస్తున్నట్టు సమాచారం. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్న ప్రధాన డీలర్లు వీటిని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి.. గోదాముల్లో ఉంచి చిన్న ప్యాకెట్లుగా మార్చి పంపిస్తుంటారు. కొవిడ్ నేపథ్యంలో ప్యాకెట్లను తయారుచేసే అవకాశం లేకపోవడంతో.. ప్రస్తుతం చిన్న పేపర్ పొట్లాలుగా రూ.10 నుంచి రూ.50, రూ.100 వరకు కట్టి.. విక్రయిస్తున్నారు. నగరంలోని చాలా పాన్‌దుకాణాల్లో ఇప్పుడు ఈ లూజు గుట్కా విక్రయాలు అధికంగా జరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పప్పుల లారీల్లో గుట్కా అధికంగా నగరానికి తరలివస్తున్నట్టు తెలిసింది. విడి పప్పులకు పన్ను లేకపోవడంతో.. వాటిని అధికారులు కూడా ఎక్కడా ఆపరు. ఇదే అదనుగా గుట్కా డీలర్లు.. పప్పుల వ్యాపారం చేసే కొందరితో ఒప్పందాలు చేసుకుని సరకును తెప్పించుకుంటున్నారు. పైన అంతా పప్పుల బస్తాలు ఉండి.. కింది భాగంలో.. ఆ గుట్కా బస్తాలను వేసి తీసుకొస్తుంటారు. రాష్ట్ర పన్నుల శాఖకు చెందిన కొందరు సిబ్బందికి ఈ విషయం తెలిసి, సదరు వ్యాపారులతో కలిసి జేబులు నింపుకుంటున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒడిస్సా నుంచి పది రోజుల కిందట ఓ లారీలో సరకు తీసుకొస్తుండగా.. విజయవాడలో కొందరు పన్నుల సిబ్బంది అడ్డుకున్నట్టు తెలిసింది. వారికి రూ.2 లక్షల వరకు అక్కడికక్కడే చెలించి.. సదరు డీలర్లు విషయం బయటకు రాకుండా సరకును తీసుకెళ్లిపోయినట్టు సమాచారం.
భారీగా ఆదాయం వస్తుండడంతో..
గుట్కా వ్యాపారంలో భారీగా లాభాలు ఆర్జిస్తున్న దళారులు విజయవాడ, గుంటూరుల్లో ఉన్నారు. కొందరు రూ.కోట్లకు పడగలెత్తినట్టు తెలిసింది. వీరికి ఏ మార్గంలో.. ఎలా సరకును తీసుకురావొచ్చో బాగా తెలుసు. విజయవాడలోని భవానీపురం అడ్డాగా.. ఈ లావాదేవీలు అధికంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. రూ.వంద పెట్టుబడి పెడితే.. కనీసం నాలుగైదింతల లాభం వచ్చే వ్యాపారం కావడంతో.. రకరకాల పద్ధతుల్లో సరకును తీసుకొస్తున్నారు. కూరగాయలు తీసుకొచ్చే లారీల్లోనూ వీటిని తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసుల తనిఖీల్లోనూ చిన్న చిన్న దుకాణాల్లో నిలువ చేసిన కిలోల కొద్దీ గుట్కా ప్యాకెట్లు దొరకడానికి ఇదే కారణం. గతంలో కంటే ప్రస్తుతం భారీగా సరకు విజయవాడకు తరలివస్తోంది. వచ్చిన సరకును వచ్చినట్టే.. లూజుగానే విక్రయిస్తుండడంతో జోరుగా అమ్మకాలు సాగుతున్నాయి.