ప్రముఖ కవి, రచయిత, ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌రావు (63) శుక్రవారం ఉదయం గుండెపోటుతో హైదరాబాద్ దోమల్‌గూడలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో తెలుగు విభాగం ఆచార్యుడిగా, తెలుగు విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యుడిగా పనిచేస్తున్నారు. సుధాకర్ 1959 జనవరి 21న నిజామాబాద్ జిల్లా పాములబస్తీలో జన్మించారు.
తల్లిదండ్రులు శాంతాబాయి, దేవయ్య. 1985-1990 మధ్య సికింద్రాబాద్‌లోని వెస్లీ బాలుర ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తర్వాత 1990-2019 మధ్య పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యుడిగా సేవలందించారు. ఇందులో సుదీర్ఘకాలం రాజమండ్రి పీఠంలోనే పనిచేశారు. విశ్వవిద్యాలయం ప్రచురించే వాంగ్మయి సాహితీ పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించారు. 2019 సెప్టెంబరులో హెచ్‌సీయూ తెలుగు విభాగంలో ఆచార్యుడిగా చేరి.. లిటరరీ ఛైర్ డీన్‌గా వ్యవహరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ జ్యూరీ సభ్యుడిగా, తెలుగు అకాడమీ, తెలుగు సలహామండలి సభ్యుడిగా సేవలందించారు.