జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాలకు పోటీ చేసే అభ్యర్థుల నామపత్రాల సమర్పణ కార్యక్రమం పరిపూర్ణంగా ముగిసింది. మూడు రోజుల పాటు దాఖలుకు అవకాశం ఉన్నా చివరి రోజైన బుధవారం అభ్యర్థులు బారులుదీరారు. జడ్పీటీసీ స్థానానికి పత్రాలు సమర్పించేందుకు వచ్చిన అభ్యర్థులతో జిల్లా పరిషత్ ప్రాంగణం కోలాహలంగా మారింది.
దాఖలు చేయించిన ముఖ్య నేతలు
మంత్రులు పేర్ని వెంకట్రామయ్య, కొడాలి వెంకటేశ్వరరావు, పామర్రు ఎమ్మెల్యే అనిల్‌కుమార్, డీసీఎంఎస్ ఛైర్మన్ ఉప్పాల రాంప్రసాద్‌లు గుడ్లవల్లేరు జడ్పీటీసీ స్థానానికి వైకాపా అభ్యర్థినిగా ఉప్పాల హారికతో నామపత్రం వేయించారు. మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు ఉంగుటూరు అభ్యర్థితో పాటు వచ్చారు. శాసనమండలి సభ్యుడు, తెదేపా జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు ఉదయం నుంచి జడ్పీలోనే ఉండి తమ పార్టీ అభ్యర్థులతో నామపత్రాలు దాఖలు చేయించారు. సీపీఐ జిల్లా నాయకురాలు అక్కినేని వనజ తమ పార్టీ అభ్యర్థులతో కలిసి వచ్చారు. ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు వచ్చిన నాయకులను, కార్యకర్తలను జడ్పీ ప్రాంగణం వెలుపలే పోలీసులు నిలిపివేశారు.
3671 మంది నామపత్రాల దాఖలు
ఎంపీటీసీ స్థానాల నామపత్రాల విషయంలో ఆఖరి రోజునే అభ్యర్థులు సంబంధిత మండల కార్యాలయాలకు బారులు తీరడంతో అక్కడి కూడా సందడి వాతావరణం అలుముకుంది. మొదటి రోజున జడ్పీటీసీ స్థానాలకు కేవలం ఇద్దరు మాత్రమే నామపత్రాలు వేయగా మంగళవారం 26 మంది వేశారు. చివరి రోజున 303 మంది నామపత్రాల సమర్పించడంతో మొత్తం 46 జడ్పీటీసీ స్థానాలకు 331 నామపత్రాలు దాఖలయ్యాయి. జిల్లాలోని 723 ఎంపీటీసీ స్థానాలకు మంగళవారం నాటికి 275 మంది నామపత్రాలు ఇచ్చారు. బుధవారం అత్యధిక సంఖ్యలో రావడంతో కొన్ని మండలాల్లో సమయం దాటిపోయాక కూడా స్వీకరించాల్సి వచ్చింది. సాయంత్రం 5 గంటలకు మిగిలిఉన్న అభ్యర్థులకు టోకెన్లు ఇచ్చారు. జిల్లా మొత్తం మీద ఎంపీటీసీ స్థానాలకు 3671 మంది నామపత్రాలు దాఖలు చేశారు.