Yadadri Temple: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన శ్రీ యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం తర్వాత స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేలసంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ నిర్మాణం చేసినంత అట్టహాసంగా సౌకర్యాలు కల్పించడంలో అధికారులు దృష్టిసారించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎండకాలం కావడంతో భక్తులను మరిన్ని సమస్యలు వేధిస్తున్నాయి. కొండపైన ఎక్కడా మరుగుదొడ్లతో పాటు మంచినీటి సౌకర్యమూ లేకపోవడం వల్ల దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండుటెండలో తాగునీరు లభించక అల్లాడుతున్నారు. శౌచాలయాలు కనిపించక కొండ దిగేవరకు ఉగ్గబట్టుకోవాల్సిన దుర్భర స్థితి ఏర్పడుతోంది. క్యూ కాంప్లెక్స్‌లో ఏర్పాటుచేసిన మరుగుదొడ్లలోనూ నీళ్లు రావడం లేదని భక్తులు చెబుతున్నారు. మరోవైపు వృద్ధులు, చిన్నపిల్లల కోసం ఏర్పాటు చేసిన ఎస్కలేటర్ పనిచేయడం లేదు. ప్రధానాలయ మాడవీధుల్లో సరిపడినన్ని మ్యాట్లు ఏర్పాటు చేయకపోవడంతో మండుటెండలో భక్తులు కాళ్లు కాలుతూనే దేవదేవుడి దర్శనం చేసుకుంటున్నారు.
Yadadri Temple: యాదాద్రికి భారీగా భక్తులు.. సౌకర్యాలు లేక ఇబ్బందులు
Yadadri Temple: యాదాద్రి పునర్నిర్మాణం తర్వాత స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను సమస్యలు వేధిస్తున్నాయి. యాదాద్రిలో బస్సు దిగినప్పటి నుంచి స్వామివారి దర్శనం వరకూ అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఆలయంలో నీళ్లు, నీడ లేక భక్తులు ముప్పుతిప్పలు పడుతున్నారు. కనీస వసతులు లేక భక్తులు అవస్థలు పడుతున్నారు.
ఆటో యూనియన్ నాయకుల ఆందోళన.. మరోవైపు కొండపైకి వాహనాలను అనుమతించడం లేదని ఆటో యూనియన్ నాయకులు ఆందోళన చేశారు. దాదాపు 300 మంది ఇక్కడ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని ఆటోడ్రైవర్లు తెలిపారు. ఏళ్లుగా ఇదే జీవనోపాధి అంటున్న ఆటోడ్రైవర్లు... తమను కొండపైకి అనుమతించాలని కోరుతున్నారు.
భక్తులకు ఇబ్బందులు.. టోకెన్ల జారీకి సంబంధించి స్పష్టమైన సమాచారం తెలియక భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం భక్తులు తమ వాహనాలను కొండ కిందే నిలిపి కల్యాణకట్ట వద్ద దర్శనం టోకెన్లను పొందాలి. ఆ తర్వాత బస్సుల ద్వారా కొండపైకి చేరి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇవేమీ తెలియని వారు బస్సుల్లో నేరుగా కొండపైకి చేరుకుంటున్నారు. తీరా అక్కడికెళ్లాక దర్శనం టోకెన్లను కిందే తీసుకోవాలని చెబుతుండటంతో... తిరిగి కొండ దిగాల్సి వస్తోంది. దర్శన నిబంధనలపై ప్రచారం చేయాల్సిన ఆలయవర్గాలు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.