పాఠశాలల విద్యార్థుల కోసం జగనన్న విద్యాకానుకను కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాది పాడు గ్రామంలో ముఖ్యమంత్రి జగన్ గత నెల 8వ తేదీన అట్టహాసంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షల మంది విద్యార్థులకు 650 కోట్ల రూపాయలు విలువైన జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీకి అదే వేదికగా శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఒక్కో విద్యార్థికి 3 జతల యూనిఫాం, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, పాఠ్య పుస్తకాలు, 1 నుంచి 5 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వర్క్ బుక్స్.. 6 నుంచి 10 వతరగతి చదువుతున్న విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగుతో పాటు 'స్టూడెంట్ కిట్' గా అందజేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే.. ఈ కిట్లు అందుకున్న 13 లక్షల మందికి ఇంకా దుస్తుల కుట్టుకూలి డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. ఒక్కో విద్యార్థికి మూడు జతల చొప్పున ఏకరూప వస్త్రాలను అందించారు. వీటికి కుట్టుకూలిని తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. తల్లిదండ్రుల బయోమెట్రిక్ నమోదు ప్రక్రియ పూర్తికాకపోవడంతో నగదు జమ పెండింగ్‌లో పడింది. 1-8 తరగతుల వారికి ఒక్కో జతకు 40 రూపాయలు, 9, 10 తరగతులకు 80 రూపాయల చొప్పున ఇవ్వాలి.
విద్యాకానుక కింద ఈ ఏడాది 42 లక్షల మందికి కిట్లను సరఫరా చేయగా.. సుమారు 29 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రుల బయోమెట్రిక్ వివరాలే నమోదయ్యాయి. వీటిల్లోనూ కొన్నింటికి బయోమెట్రిక్, ఆధార్‌కు మధ్య పొంతన కుదరడం లేదు.