మా అబ్బాయి చదువుల్లో చాలా చురుగ్గా ఉంటాడు... ఏడాది నుంచి ఫోన్ ఎక్కువ చూస్తున్నాడు... ఒంటరిగా ఉంటూ.. అందులో గేమ్స్ ఆడుతున్నాడు. ఇంట్లో ఎవరితోనూ పెద్దగా మాట్లాడడం లేదు.
డాక్టర్ గారు.. మా అమ్మాయికి చదువుపై ఏకాగ్రత ఉండడం లేదు. ఆన్‌లైన్ తరగతులు జరుగుతున్నా దృష్టి పెట్టడం లేదు. ఎప్పుడూ ఏదొక యాప్‌తో కాలక్షేపం చేస్తోంది.
విజయవాడ నగరంలో సైకియాట్రిస్టులు, సైకాలజిస్టుల వద్దకు వచ్చే ప్రతి పది మందిలో ఎనిమిది కేసులు ఇలాంటివే ఉంటున్నాయి. గతంలో వారాంతంలోనే ఫోన్‌ను ముట్టుకునేవారు. కొవిడ్ కారణంగా పరిస్థితుల్లో ఒక్కసారిగా మార్పులొచ్చాయి. ఆన్‌లైన్ క్లాసుల కారణంగా వీటితో సహవాసం తప్పనిసరి అయింది. దీంతో తెలియకుండానే మొబైళ్లకు బానిసలవుతున్నారు. గట్టిగా మందలిస్తే ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.
వద్దన్నా వినడం లేదు..
- నిత్యం ఫోన్‌లో ఆటలాడుతోందని తల్లి మందలించడంతో ఇటీవల కంచికచర్లలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక తనువు చాలించింది. తల్లి నిద్రలో ఉన్న సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని మృతి చెందింది.
- కైకలూరు మండలం పల్లెవాడకు చెందిన బాలిక, తన తండ్రి ఫోన్‌ను ఆన్‌లైన్ తరగతులకు ఉపయోగిస్తోంది. మిగిలిన సమయంలో ఫోన్ ఎక్కువ చూడొద్దని గట్టిగా చెప్పారని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో టీలో ఎలుకల మందు కలుపుకుని తాగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
- తొమ్మిదో తరగతి చదువుతున్న విజయవాడ బాలుడు, క్లాసులో టాపర్. ఏడాది నుంచి పాఠశాలలు లేకపోవడంతో ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతున్నాడు. ఖాళీ సమయంలో కాలక్షేపం కోసం సరదాగా ఫోన్‌లో ఆట మొదలుపెట్టాడు. క్రమంగా దీనికి బానిసయ్యాడు. ఉత్సుకతతో ఒక్కో లెవల్ పెంచుతూ రోజుకు 8 గంటలు ఆడే వరకు వెళ్లింది. మిగిలిన సమయంలోనూ ఆటపైనే ధ్యాస. ఏకాగ్రత కోల్పోయాడు. తల్లిదండ్రులు వద్దని చెబుతున్నా వినడం లేదు. రాత్రి సమయాల్లోనూ నిద్రపోకుండా చాటుగా సెల్‌లో ఆటలాడుతున్నాడు. దీంతో పరిస్థితి చేయి దాటుతోందని భావించి, మానసిక శాస్త్రవేత్త వద్దకు తీసుకెళ్లారు.
మానసికంగా తీవ్ర ప్రభావం..
చేతిలో మొబైల్ లేనిదే నిద్ర పట్టని పరిస్థితి. దీంతో మానసికంగా అనేక సమస్యలను కొనితెచ్చుకున్నారు. విచ్చలవిడి వాడకం కారణంగా మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. పిల్లలపై పెను ప్రభావాన్ని చూపిస్తోంది. పిల్లల్లో జ్ఞాపకశక్తి తగ్గిపోతుండడం, నిద్రకు దూరమవడం వంటికి ప్రధానంగా కనిపిస్తున్నాయని మానసిక వైద్యులు చెబుతున్నారు. సరైన నిద్ర లేకపోవడంతో మొండితనం, చిరాకు, అసహనం, కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. తగినంత విశ్రాంతి లేకపోవడం వల్ల నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతోంది. ఏకాగ్రత కొరవడి చదువు దెబ్బతింటోంది.