కరోనా లాక్డౌన్ కారణంగా గత 6 నెలలుగా పాఠశాలలు మూతపడటంతో ప్రైవేటు ఉపాధ్యాయుల జీవనం దుర్భరమైంది. ఇప్పటి వరకు పాఠశాలలు తెరుచుకోకపోవటంతో ఉపాధి కరువై...ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోతున్నారు. కుటుంబ పోషణ కోసం ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు చూస్తున్నారు.
కూలీలుగా మారి
బడిలో పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులకు..కరోనా బతుకు పాఠం నేర్పించింది. తననే నమ్ముకున్న కుటుంబాన్ని పోషించటం కోసం కూలీ పనులకు వెళ్లేలా చేసింది. కొందరు కూలీలుగా, తాపీ మేస్త్రీలుగా, మరికొంత మంది ప్రైవేటు ఉపాధ్యాయులు పండ్లు, కూరగాయాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ మనసు చంపుకొని కూలీ పనులకు వెళ్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"బీఎస్సీ , బీఈడీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం రాక ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో గత పది పదిహేను సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను. కరోనా మా జీవితాలను అతలాకుతలం చేసింది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన మేము.. మనసు చంపుకొని కూలీ పనులకు వెళ్తున్నాం. కుటుంబాన్ని పోషించుకోవటానికి మరోదారి కనిపించటం లేదు" -మల్లిక, ప్రైవేటు ఉపాధ్యాయురాలు