ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రైవేటు విద్యాసంస్థలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలి' - విజయవాడలో ప్రైవేటు విద్యాసంస్థల సంఘాల సమావేశం వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థల సిబ్బందిని ఆదుకోవాలని కోరుతూ 8కి పైగా సంఘాలు సంయుక్త కార్యాచరణ సమితిగా ఏర్పడ్డాయి. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించాయి.

private schools jac meeting in vijayawada
ప్రైవేటు విద్యాసంస్థల సంఘాల సమావేశం

By

Published : Oct 10, 2020, 4:15 PM IST

ప్రైవేటు పాఠశాలలన్నీ వ్యాపార సంస్థలు కావని.. కొన్నిచోట్ల జరిగిన సంఘటలను రాష్ట్రంలోని 16 వేల పాఠశాలలకు ఆపాదించరాదని ప్రైవేట్ పాఠశాలల సంఘాలు ప్రభూత్వాన్ని కోరాయి. ఏ పాఠశాలలో తప్పు జరిగితే ఆ సంస్థ యాజమాన్యంపై చట్టపరంగా శిక్షించడానికి ప్రభుత్వానికి పూర్తి హక్కులున్నాయని సంఘాల ప్రతినిధులు చెప్పారు. అంతేకాని రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను ఒకేలా చూసి.. ఒకరు చేసిన తప్పు వల్ల అందరినీ శిక్షించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు విద్యా సంస్థలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ సందర్భంగా ఎలాంటి రాయితీలు, సహకారం ఇవ్వలేదని గుర్తు చేశారు.

2019-20 విద్యా సంవత్సరానికి ఫీజు బకాయిలు వసూలు చేయకూడదని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకపోయినా... జిల్లా, మండలస్థాయి అధికారులు ఫీజులు వసూలు చేస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని సూచించినా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని... ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించకుండా, గత ఏడాది ఫీజు బకాయిలు వసూలు చేయకుండా.. సిబ్బందికి జీతాలు చెల్లించలేమని వారు.. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో తేల్చి చెప్పారు.

పాఠశాలల గుర్తింపు రెన్యువల్‌కు కనీస గడువు ఇవ్వకుండా గుర్తింపు లేని వాటిని మూసివేయాలని ఆదేశించడం అత్యంత బాధాకరమన్నారు. మానవతా దృక్పథంతో ఆయా పాఠశాలలకు బేషరతుగా రెండేళ్లపాటు స్కూలు గుర్తింపును పొడిగించాలని కోరారు. తక్షణమే విద్యా క్యాలెండర్‌ను ప్రభుత్వం ప్రకటించాలని... ఇంటర్మీడియట్‌ కళాశాలల్లో సిలబస్ పై‌ ఏ విధంగా స్పష్టత ఇచ్చారో, పాఠశాలల పరిధిలోనూ ఆ తరహా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు, ఫీజుల వసూలుకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించాయి. లేనిపక్షంలో ప్రభుత్వమే ప్రైవేటు పాఠశాలలను తమ ఆధీనంలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి.

ఇవీ చదవండి:

సౌరవిద్యుత్.. అటు పర్యావరణహితం.. ఇటు లాభదాయకం

ABOUT THE AUTHOR

...view details