తెలంగాణలో 11,000 వరకు ప్రైవేట్ పాఠశాలలు ఉండగా అందులో దాదాపు 8 వేల వరకు బడ్జెట్ పాఠశాలలే. వాటిల్లో వార్షిక రుసుం తరగతులను బట్టి రూ. 4,000 నుంచి రూ. 25,000 వరకు ఉంటాయి. 2020-21 విద్యా సంవత్సరంలో దాదాపు 2,000 బడ్జెట్ పాఠశాలలు మూతపడతాయని ట్రస్మా చెబుతుండగా.. కచ్చితంగా 1,000 వరకు ఉంటాయని కరస్పాండెంట్లు అంటున్నారు. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 100 వరకు ఉంటాయని, అందులో అర్బన్ జిల్లాలో 50 పాఠశాలలు మూతపడుతున్నాయని తెలంగాణ గుర్తింపు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) వరంగల్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి, రాష్ట్ర కార్యవర్గం ఈసీ సభ్యుడు మాదల సతీష్ చెప్పారు. కొందరు ప్రస్తుతం ఇతర పనుల్లో నిమగ్నమయ్యారు. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ఒడితల గ్రామంలో పాఠశాల కరస్పాండెంట్ ట్రాక్టర్ దున్నుతూ వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు.
మూడు నెలల వేతనాలు చెల్లించాలి..
వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో అదే గ్రామానికి చెందిన ఉమామహేశ్వర్ 1997లో ప్రైవేట్ పాఠశాల ప్రారంభించారు. అందులో 200 మంది వరకు విద్యార్థులున్నారు. కరోనా కారణంగా మార్చి మధ్యలో విద్యాసంస్థలను మూసివేయడంతో 50 శాతం వరకు రుసుములు వసూలు కాలేదు. సిబ్బందికి మూడు నెలల వేతనాలు చెల్లించాల్సి ఉంది. వాహనాల ఈఎంఐలు, అద్దె నెలకు రూ. 20,000 చెల్లించే పరిస్థితి లేదు. మళ్లీ పునఃప్రారంభమైతే అన్ని నిబంధనలు పాటిస్తూ నడిపే పరిస్థితి లేకపోవడం వల్ల మూసివేయడానికి నిర్ణయించారు. అదే విషయాన్ని సిబ్బందిని చెప్పి వేరే దారి చూసుకోవాలని, లేకుంటే మీరు అందరూ కలిసి నడుపుకోవచ్చని ప్రతిపాదించారు.
ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు
హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి సమీపంలోని ఓ ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 7 వరకు తరగతుల్లో 160 మంది విద్యార్థులు ఉన్నారు. వారి నుంచి 40 శాతం రుసుములు వసూలు కాలేదు. భవనం నెల అద్దె రూ. 34,000. మళ్లీ పాఠశాలలు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు. ఆన్‌లైన్ తరగతులు నిర్వహిద్దామంటే ఆ బడిలో చదివేవారు ఎక్కువ పేద కుటుంబాలకు చెందిన వారు. వచ్చే విద్యా సంవత్సరం బడి నడపడం తన వల్ల కాదని ఆ పాఠశాల నిర్వాహకుడు అక్కడ పనిచేసే 12 మంది సిబ్బందికి వేరే కొలువులు చూసుకోవాలని చెప్పారు. డిప్యూటీ ఈఓకు మూసివేస్తున్నట్లు త్వరలో లేఖ ఇచ్చి అధికారికంగా ప్రకటిస్తానని కరస్పాండెంట్ తెలిపారు.