'ఫీజుల తగ్గింపుతోనే..పీజీ కళాశాలల్లో ప్రవేశాల నిలుపుదల' - 'ప్రభుత్వానిది ఏకపక్ష నిర్ణయం..మేం కళాశాలలను నడపలేం'
ప్రభుత్వం తీసుకున్న ఏకపక్షనిర్ణయాలతో కళాశాలను నడపలేమని ఈ ఏడాది ప్రవేశాలను నిలిపివేశామని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల యాజమాన్య సంఘం తెలిపింది. కొత్త ఫీజుల విషయంలో కనీసం సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఆమోదించిందని వెల్లడించింది.
!['ఫీజుల తగ్గింపుతోనే..పీజీ కళాశాలల్లో ప్రవేశాల నిలుపుదల' private-medical-collages-on-fees](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7521696-232-7521696-1591581580562.jpg)
పీజీ వైద్య విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనం కంటే తక్కువగా రుసుములను నిర్ణయించడం వల్ల తాము కళాశాలలను నడిపే పరిస్థితి లేక ఈ ఏడాది ప్రవేశాలను నిలిపివేశామని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల యాజమాన్య కమిటీ ఆదివారం తెలిపింది. కొత్త ఫీజుల నిర్ధరణలో కనీసం సంప్రదింపులకు సైతం అవకాశం ఇవ్వకుండా, పారదర్శకత లేకుండా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్(ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ) ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందన్నారు. దీన్ని ప్రభుత్వం ఆమోదించడం వల్లే తాము ఈ ఏడాది ప్రవేశాలను ఆపేశామని వివరించింది. ‘‘మేము(కళాశాలలు) పీజీ మెడికల్ విద్యార్థికి ఒక్కొక్కరికీ నెలకు రూ.30వేల చొప్పున రూ.3.6లక్షలు, డెంటల్ విద్యార్థికి రూ.25వేల చొప్పున రూ.3లక్షల స్టయిపెండ్ ఇస్తున్నాం. అలాంటిది ఈ ఏడాది ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ కనీసం మా ఖర్చులు, పద్దులను పట్టించుకోకుండా ఏకపక్షంగా పీజీ మెడికల్‌కు కన్వీనర్ కోటా ఫీజును రూ.4.32లక్షలు, మేనేజ్‌మెంట్ కోటాకు రూ.8.64లక్షలు ఫీజుగా నిర్ణయించింది. 2017 ఫీజులకు ఏటా ఐదు శాతం కలిపినా.. మెడికల్‌కు కన్వీనర్ కోటా రూ.7.98లక్షలు, మేనేజ్‌మెంట్‌కు రూ.28లక్షలు, డెంటల్‌కు కన్వీనర్ కోటా రూ.6.36లక్షలు, మేనేజ్‌మెంట్‌కు రూ.11.57లక్షలు అవుతుంది. కనీసం మా పరిస్థితిని అర్థం చేసుకోకుండా జీవోలను జారీ చేసి ప్రవేశాల నోటిఫికేషన్ ఇచ్చారు. కళాశాలలకు చెల్లించే ఫీజులను ప్రభుత్వం అసంబద్ధంగా తగ్గించడం వల్ల తలెత్తే సమస్యలను వివరించి ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలనే పూర్తి వివరాలతో ప్రకటనను విడుదల చేస్తున్నాం’’అని కమిటీ పేర్కొంది.