Prisoners release: స్వాతంత్య్ర అమృత మహోత్సవాల్లో భాగంగా.. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ఏడాది కాలవ్యవధిలో మూడు విడతల్లో విడుదల చేయాలని.. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ప్రత్యేక ఉపశమనం కింద ఈ ఏడాది ఆగస్టు 15న తొలి విడత, వచ్చే ఏడాది జనవరి 26న రెండో విడత, ఆగస్టు 15న మూడో విడత విడుదల చేయనుంది. దీనికి సంబంధించి అర్హుల జాబితా రూపకల్పన కోసం మార్గదర్శకాలు ఖరారు చేసింది. దానికనుగుణంగా ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ కసరత్తు చేస్తోంది. వారంరోజుల్లో ఈ ప్రక్రియ కొలిక్కి రానుంది.
అర్హుల జాబితాను రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదించిన తర్వాత.. గవర్నర్‌కు పంపిస్తారు. మరణ శిక్ష, జీవిత ఖైదు, మరణ శిక్ష నుంచి జీవిత ఖైదు పొందిన వారికి విడుదలకు అవకాశం లేదు. ఉగ్రవాద కార్యకలాపాలు, వరకట్న వేధింపులు, అత్యాచారం, నకిలీ కరెన్సీ, లైంగిక అక్రమ రవాణా, మనీ లాండరింగ్, మాదకద్రవ్యాలు, ఆయుధాల సరఫరా, అవినీతి నిరోధక చట్టం, రాజద్రోహం.. తదితర కేసుల్లో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలు అనర్హులు.