ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ARREST: రాహుల్ హత్య కేసులో కీలక నిందితురాలు గాయత్రి అరెస్టు - క్రైమ్ వార్తలు

RAHUL MURDER CASE
RAHUL MURDER CASE

By

Published : Sep 3, 2021, 6:51 PM IST

Updated : Sep 3, 2021, 7:48 PM IST

18:49 September 03

ఆ రూ.6 కోట్ల కోసమే

విజయవాడలో జరిగిన రాహుల్ హత్య కేసులో కీలక నిందితురాలు గాయత్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన కుమార్తె పీజీ వైద్యసీటు కోసం రాహుల్​కు రూ. 6 కోట్లు ఇచ్చిన గాయత్రి... సీటు ఇప్పించకపోవటంతో నగదు తిరిగి ఇవ్వాలని కోరింది. రాహుల్ రోజులు గడుస్తున్నా నగదు తిరిగి ఇవ్వకపోవటంతో నిందితులు కోరాడ, కోగంటిలతో కలిసి హత్యకు పథకం వేసినట్లు పోలీసుల విచారణలో తెలిపింది. 

విచారణలో నిజం ఒప్పుకోవడంతో నిందితురాలు గాయత్రిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటివరకు ఈకేసులో 12 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. అరెస్ట్ చేసిన నిందితులను తిరిగి కస్టడీకి తీసుకుని విచారించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇందులో భాగంగా నిందితుడు కోగంటి సత్యంను రెండు రోజుల పోలీసు కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో పోలీసులు కొన్ని కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది.

అసలు ఏం జరిగిందంటే..

రాష్ట్రంలో సంచలనం రేపిన జిక్సిన్‌ సిలిండర్ల కంపెనీ ఎండీ రాహుల్ హత్య కేసు (rahul murder case) దర్యాప్తును ఓ కొలిక్కి తెస్తున్నారు విజయవాడ పోలీసులు. నిందితుడు కోగంటి సత్యంను.. కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. విచారణలో కోగంటి నివ్వెరపోయే నిజాలను బయటపెట్టారు. తన కుమార్తె వైద్య సీటు కోసం గాయత్రి.. రాహుల్‌కు 6 కోట్ల రూపాయలు ఇచ్చిందని తెలిపాడు. ఆ మొత్తాన్ని రాహుల్‌ తిరిగి ఇవ్వనందుకు.. అతన్ని హత్య చేయించాలని పథకం పన్నిందని చెప్పాడు. ఆ మేరకు కోగంటి, కోరాడతో కలిసి హత్యకు వ్యూహరచన చేసింది. నిందితులంతా కొత్త సెల్ ఫోన్‌లు, సిమ్ కార్డులు తీసుకొని.. వాటి ద్వారానే హత్యకు సంబంధించిన విషయాలను మాట్లాడుకున్నారని విచారణలో పోలీసులు గుర్తించారు. రాహుల్‌ను ఎలా ఇంటి నుంచి బయటకు రప్పించాలి.. ఎక్కడ హత్య చేయాలనే విషయాలపై ముందే పథక రచన చేసినట్లు పోలీసులు తెలిపారు.

రాహుల్​ను మొదట కోరాడ ఫైనాన్స్​కు పిలిపించి.. అక్కడ అతనిపై దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తర్వాత గాంధీనగర్ లోని దుర్గా కళామందిర్‌కు తీసుకెళ్లి.. అక్కడ కోగంటి సత్యం సమక్షంలో మరోసారి దాడి చేశారు. తనకు ఇవ్వాల్సిన 6 కోట్ల రూపాయలు ఇవ్వకపోవడంతో.. కంపెనీలో రాహుల్‌కు సంబంధించిన కొంత వాటాను గాయత్రి …తన కుమార్తె, అల్లుడు పేర్లపైకి మార్పించుకొంది. కొంత వాటాను కోరాడ విజయ్ కుమార్.. తన పేరు మీద రాయించుకున్నారు. ఆ తర్వాత పథకం ప్రకారం రాహుల్‌ను కారులో తీసుకెళ్లి.. హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో కోరాడ ఫైనాన్స్, దుర్గా కళామందిర్, సంఘటనా స్థలం, సత్యందొడ్డి ప్రాంతాలు కీలకం. ఒక చోటకు వచ్చిన నిందితులు మరోచోటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. నాలుగు ప్రాంతాల్లో ఎవరెవరు ఉండాలి? ఏ పని చేయాలి ? అనే విషయాలు నిందితులు ఫోన్లలోనే మాట్లాడుకున్నారని విచారణలో బయటపడింది.

హత్య ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు నిందితులు జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాహుల్‌ను హత్య చేసిన కేబుల్‌ను.. ఆయన సెల్ ఫోన్‌ను పారేసినట్లు వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నా కేసు దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు వారంతా తప్పుడు సమాచారం ఇచ్చారని స్పష్టం చేశారు. అయితే కారులో నమోదైన సాంకేతిక ఆధారాలు పోలీసులకు దర్యాప్తులో ఉపయోగపడ్డాయి. వీటి ఆధారంగానే హత్య సమయాన్ని గుర్తించారు. ఆమేరకు ఆయా మార్గాల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను సేకరించారు. 

ఇదీ చదవండి:

RAHUL MURDER CASE : రాహుల్ హత్య కేసు... కీలక నిందితుల కోసం గాలింపు

RAHUL MURDER CASE: 'వ్యాపార లావాదేవీల్లో వివాదాలే రాహుల్ హత్యకు కారణం' 

PROPERTY TAX: విజయవాడలో ఆస్తి పన్ను సవరిస్తూ నోటిఫికేషన్

Last Updated : Sep 3, 2021, 7:48 PM IST

ABOUT THE AUTHOR

...view details