తొలివిడతలో విజయవాడ డివిజనులోని 234 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 13న పోలింగ్ జరగనుంది. అదేరోజు ఫలితాలు వెలువడతాయి. గుర్తులు వచ్చిన తర్వాతే అభ్యర్ధుల ప్రచారం సాగుతుంది. బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల్లో పత్రాలపై గుర్తులు తప్ఫ.. పేర్లు ఉండవు. దీంతో ప్రస్తుతం ప్రచారం సాగడం లేదు. కానీ నామినేషన్ల ఉపసంహరణకు ఏకగ్రీవాలకు పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికలైనా.. రాజకీయ పార్టీలదే పైచేయిగా ఉంది. ఇప్పటికే కొన్ని పంచాయతీలు సర్దుబాటు చేసుకున్నారు. మైలవరం, నందిగామ, విజయవాడ గ్రామీణ మండలాల పరిధిలో ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి.
*నందిగామ నియోజకవర్గంలో కేతవీరునిపాడు పంచాయతీ ఏకగ్రీవం చేశారు. వైకాపా సానుభూతిపరులకు దక్కింది. ఉపసర్పంచ్ తెదేపాకు కేటాయించనున్నారు. నందిగామ మండలంలో 39 వార్డులు ఏకగ్రీవం అయినట్లే. వీరులపాడు మండలంలో గోకరాజుపల్లి, చట్టన్నవరం ఏకగ్రీవాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కంచికచర్ల మేజరు గ్రామ పంచాయతీలో తెదేపా మధ్య పోటీ ఎక్కువైంది. చందర్లపాడు మండలం బొబ్బిళ్లపాడు, నందిగామలో మాగల్లు పంచాయతీలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
*ఇక్కడ పంచాయతీలకు మండలస్థాయి నేతలతో కమిటీ, పరిశీలకుల కమిటీ నియోజకవర్గ స్థాయి నేతలతో ఏర్పాటు చేసి సంప్రదింపులకు సర్దుబాటులకు వైకాపా నేతలు ప్రయత్నాలు చేయడం విశేషం. సామరస్యంగా పరిష్కారం చేసుకునేందుకు గ్రామ స్థాయిలో చర్చలు చేస్తున్నారు.● గన్నవరం నియోజకవర్గం పరిధిలో ప్రసాదంపాడు ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఇందుకోసం కృషి చేస్తుండగా సొంత పార్టీలోని ఇతర వర్గాల నేతలు సహకరించడం లేదనే వాదన ఉంది. నున్నలో వైకాపాలో పోరు ఉంది. ఎనికేపాడులో తెదేపా సానుభూతిపరుని నామినేషన్ చెల్లుబాటు కాకపోవడం వివాదంగా మారింది.