ఆదివాసీలను ఉన్నత స్థానాల్లోకి తేవడం అరుదుగా జరుగుతుందని, పేద గిరిజన కుటుంబంలో పుట్టిన ద్రౌపదీ ముర్మును ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసిందని తెలిశాక, సామాజిక న్యాయం కోసం ఆమెకు మద్దతివ్వాలని నిర్ణయించామని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరచడాన్ని గర్వకారణంగా భావిస్తున్నామని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోసం మంగళవారం రాష్ట్రానికి వచ్చిన ద్రౌపదీ ముర్ము విజయవాడలో తెదేపా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. దీనికి ముందు తెదేపా నాయకులు ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో సమావేశమై రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ముర్ము అభ్యర్థిత్వాన్ని బలపరచాల్సిన అవసరం గురించి చర్చించారు. అనంతరం సమావేశం జరిగే హోటల్‌కు చేరుకున్నారు. ముర్ముకు చంద్రబాబు ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఆమె వెంట కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వచ్చారు. 'ముర్మును ఎంపిక చేసిన ప్రధాని నరేంద్ర మోదీని అభినందిస్తున్నాను. తెదేపా ఎంతో బాధ్యతగా ఆలోచించి ఆమెకు మద్దతివ్వాలని నిర్ణయించింది' అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘రాష్ట్రపతి అభ్యర్థిగా మీ ఎంపిక బలహీనవర్గాలకు గర్వకారణం. తెదేపా తరఫున మీకు సంపూర్ణ సహకారం అందిస్తాం’ అని ముర్ముతో చెప్పారు.
మీ సోదరి ఎన్నికయ్యేలా ఆశీర్వదించండి: ద్రౌపదీ ముర్ము
'ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు నా నమస్కారాలు’ అంటూ ద్రౌపదీ ముర్ము తెలుగుతో ప్రసంగం ప్రారంభించారు. ‘ఆంధ్రప్రదేశ్ ఇది ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు, మహాకవులకు పురిటిగడ్డ. నన్ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం సామాజిక న్యాయానికి, మహిళా సాధికారతకు లభించిన గౌరవంగా భావిస్తున్నాను. దేశం 75ఏళ్ల స్వాతంత్య్ర విజయోత్సవాలు చేసుకుంటున్న వేళ.. మీ సోదరిని దేశ అత్యున్నత పీఠంపై కూర్చునేలా ఆశీర్వదించండి' అని ఆమె కోరారు.
మాతో సమావేశం జరగకూడదని వైకాపా పన్నాగం: తెదేపా నేతలు
తెదేపా నాయకులతో ద్రౌపదీ ముర్ము సమావేశమవకుండా చూసేందుకు వైకాపా నాయకులు ప్రయత్నించారని తెదేపా నేతలు ఆరోపించారు. ‘సీఎం జగన్‌తోనూ, వైకాపా ప్రజాప్రతినిధులతోనూ సమావేశమై వెళ్లిపోవాలని వాళ్లు పట్టుబట్టారు. తెదేపా నాయకులతో సమావేశం రద్దు చేసుకోవాలని భాజపా నాయకులపై ఒత్తిడి తెచ్చారు. ఆ విషయాన్ని భాజపా నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తే ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అభ్యర్థి ఎవరిని కలవాలో, ఎవరిని కలవొద్దో నిర్ణయించడానికి వాళ్లెవరని ఆయన అసహనం వ్యక్తం చేశారు. తెదేపా నాయకులతో సమావేశం జరిగి తీరాలని స్పష్టం చేశారు’ అని తెదేపా నేత ఒకరు పేర్కొన్నారు.