Chalo Vijayawada Success: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమం విజయవంతమైందని పీఆర్సీ సాధన సమితి నేతలు అన్నారు. ఈనెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పించిన అడ్డంకులను అధిగమించి వేలాదిగా ఉద్యోగులు విజయవాడకు తరలివచ్చారు. ‘చలో విజయవాడ’ ఆందోళనతో బెజవాడ వీధులు రాలనంతగా కిక్కిరిసిపోయాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు.. ఎన్జీవో హోం నుంచి అలంకార్ థియేటర్ మీదుగా బీఆర్‌టీఎస్ కూడలి వరకు భారీ నిరసన ప్రదర్శన చేపట్టాయి.
ఈనెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి: బొప్పరాజు
'ఇది బలప్రదర్శన కాదు.. ఉద్యోగుల వేదనే చలో విజయవాడ' అని పీఆర్సీ సాధన సమితి సభ్యులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. చలో విజయవాడ విజయవంతమైందన్నారు. ఈనెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు బొప్పరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉద్యోగులందరికీ సాధన సమితి తరుపున కృతజ్ఞతలు తెలిపారు.
'ప్రభుత్వంతో మేం ఘర్షణ వైఖరి కోరుకోవట్లేదు. గడిచిన కొన్నాళ్లుగా మీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. కమిటీలతో మేము ఇక చర్చించే ప్రశ్నే లేదు. సీఎంతో చర్చించే అవకాశం కల్పించకుండా అధికారులు మాయ చేశారు. ఈనెల 5 నుంచి పూర్తిగా సహాయ నిరాకరణ.. 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నాం. సమ్మెతో ప్రజలకు అసౌకర్యం కలిగితే ప్రభుత్వానిదే బాధ్యత. ఇలాంటి పీఆర్సీ ప్రకటించడం ఒక చరిత్ర. ఉద్యోగుల ఉద్యమం కూడా ఒక చరిత్రే. ప్రభుత్వం చెబుతుందీ అన్నీ దొంగలెక్కలే. డిమాండ్లు నెరవేర్చేవరకు ఉద్యమం ఆగదు. ప్రభుత్వానికి ఇప్పటికైనా కనువిప్పు కలగాలి. - బొప్పరాజు వెంకటేశ్వర్లు
ప్రభుత్వం దిగివచ్చే వరకు ఉద్యమం కొనసాగిస్తాం: వెంకట్రామిరెడ్డి
పీఆర్సీ సాధన సమితి.. పీఆర్సీ డిమాండ్ల సాధన వరకే పరిమితం కాదని.. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసే వరకు సమితి పోరాడుతుందని స్పష్టం చేశారు. దీంతో పాటు ఆర్టీసీ కార్మికులు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు న్యాయం జరిగే వరకూ పీఆర్సీ సాధన సమితి పోరాడుతుందన్నారు.
ముఖ్యమంత్రి చర్చలకు పిలవాలి: బండి శ్రీనివాసరావు
ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి చర్చలకు పిలవాలని పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నామని.. సీఎం జగన్ నేరుగా చర్చించి న్యాయం చేయాలన్నారు. ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది జీతాలు పెంచాలన్నారు.