ఎగువన ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. నదిలో నీటి ప్రవాహం ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఎగువ నుంచి వచ్చే వరదకు పులిచింతల ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా చేరుతోంది. ఎగువ నుంచి నీటి ప్రవాహం పెరగడంతో బ్యారేజీ వద్ద 7౦ గేట్లును కొద్దిమేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
బ్యారేజీకి 75 వేల 811 క్యూసెక్కులు.. కాలువలకు 1561 క్యూసెక్కులు వదలగా.. మిగిలిన 74వేల 250 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. నది పరివాహక, దిగువన ఉన్న ముంపు ప్రాంతాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గేట్లు ఎత్తడంతో బ్యారేజీ వద్ద భారీ ప్రవాహాన్ని చూసేందుకు పర్యాటకులు పెద్దఎత్తున తరలి వస్తున్నారు.