పొద్దున్నే స్కూలూ, సాయంత్రం కాసేపు ఆడుకోవడం లేదా ఏదయినా హాబీ క్లాస్... ఆ తరువాత ట్యూషనూ చదువూ... రాత్రి తొమ్మిదీ తొమ్మిదిన్నరకు నిద్రపోవడం... ఇలా ఏడాది క్రితం వరకూ పిల్లలకు ఓ పక్కా దినచర్య ఉండేది. ఇప్పుడు అవేవీ లేకపోవడంతో ఫోనూ, టీవీ, కంప్యూటరుతోనే కాలక్షేపం చేస్తున్నారు. పోనీ తోటి పిల్లలతో కాసేపు ఆడుకునేందుకు బయటకు పంపిద్దామనుకుంటే కరోనా భయం. అలాగని ఏదయినా పుస్తకం చేతికిచ్చి చదవమంటే నాలుగు పేజీలు తిరగేసి మళ్లీ ఫోను పట్టుకుంటారు. ఇలాంటి పిల్లల్లో పుస్తక పఠనంపైన ఆసక్తి పెంచేలా చేస్తాయి ఈ ‘త్రీడీ పాప్- అప్ స్టోరీబుక్స్’. ఇవీ కథల పుస్తకాలే కానీ వీటిల్లోని బొమ్మలు త్రీడీ రూపంలో కథను కళ్లకు కడుతూ ఆకట్టుకుంటాయి. గతంలోనూ ఇలాంటి పుస్తకాలు ఉన్నా-కరోనా కాలంలో ఇంటికే పరిమితమై కాలక్షేపం కరవైన పిల్లలకు ఎలాగైనా పుస్తకపఠనం అలవాటు చేయాలన్న లక్ష్యంతో - అల్లాద్దీన్ అద్భుతదీపం నుంచి హ్యారీపాటర్ వరకూ అన్ని పుస్తకాలనూ ‘పాప్ -అప్’ రూపంలో తెస్తున్నారు ప్రచురణ కర్తలు.
కథలోని బొమ్మ... కళ్లముందుకొస్తే...!
ఈతరం పిల్లలకు ఓ కథల పుస్తకాన్ని ఇస్తే...‘ఎందుకూ యూట్యూబ్ ఉందిగా’ అనేస్తారు. అలాంటి చిన్నారుల్ని కూడా పుస్తకాల పురుగుల్లా మార్చేస్తాయి ‘పాప్-అప్ స్టోరీ బుక్స్’. ఈ పుస్తకాల్లోని బొమ్మలు త్రీడీ రూపంలో కనిపిస్తూ ‘అబ్బ... హ్యారీపాటర్ కథలోని కోట ఇంత బాగుంటుందా...’, ‘సిండ్రెల్లా కథలోని రథం ఇలా ఉంటుందా...’ అనిపిస్తాయి. వాటిని చూస్తున్న అనుభూతిని కలిగిస్తాయి.
బొమ్మలు కనిపించడమంటే...
ఏ కథల పుస్తకంలోనైనా బొమ్మలు కథలోని సందర్భానికి తగినట్లుగా పెద్దగానో, చిన్నగానో ఉంటాయి. కొన్ని రంగురంగుల్లో ఉంటే.. మరికొన్ని పేరుకే బొమ్మల్లా కనిపిస్తాయి. కానీ ‘పాప్-అప్ స్టోరీ బుక్స్’ అలా ఉండవు. కథకు తగినట్లుగా బొమ్మ త్రీడీ రూపంలో కనిపిస్తుంది. ఉదాహరణకు హ్యారీపాటర్ కథలోని కోటనే తీసుకుంటే మామూలు పుస్తకంలో అది పెన్సిల్‌తోనో పెన్నుతోనో గీసిన బొమ్మలా ఉంటుంది కదా.. అదే ఈ ‘పాప్-అప్’ పుస్తకాల్లో అయితే అట్టతో కోట కట్టి పుస్తకంలో తీసుకొచ్చి పెట్టినట్లు ఉంటుంది. అదేవిధంగా సిండ్రెల్లా కథలోని రాజకుమారుడి రథం, ఆమె తోబుట్టువులూ... జంగిల్‌బుక్‌లోని మోగ్లీ, ఇతర జంతువులూ, అడవీ.. ఇలా అన్నింటినీ త్రీడీలో చూస్తూ కథను చదువుకోవచ్చు. ఇక, మరీ చిన్నపిల్లలకోసం వాహనాలూ, జంతువులూ, అక్షరాల్లాంటివి కూడా పిల్లలకు నచ్చేలా త్రీడీ రూపంలో వచ్చేస్తున్నాయి. ఈ పుస్తకాల్లో కథలు చిన్నగా, బొమ్మలు పెద్దగా ఉండి... వాటన్నింటినీ స్వయంగా చూస్తున్న అనుభూతి కలుగుతుంది గనుకే పిల్లలు వీటిని
పట్టుకుంటే వదలరు. అర్థమైంది కదా... ఈసారి చిన్నారులకు కథల పుస్తకాలను కొనివ్వాలనుకుంటే ఇలాంటివి ఎంచుకుని చూడండి... ఆ బొమ్మలతో ఆడుకుంటూ ఆసక్తిగా చదువుకుంటూ పుస్తకాల పురుగులైపోతారంటే నమ్మండీ...!