Poor Farmer Cultivation: వ్యవసాయ పనులు చేయాలంటే ఒకప్పుడు ప్రతి రైతుకు ఎడ్లూ ఉండాల్సిందే. కాలక్రమంగా వచ్చిన ఆధునిక పరికరాలతో ఎడ్లు లేకుండానే సాగు పనులు సాగుతున్నాయి. వాటిని వినియోగించే ఆర్థికస్థోమత లేనివారు ఇప్పటికే నాగలి పట్టి పొలం దున్నుతున్నారు. కానీ ఎద్దులు అందుబాటులో లేక.. యంత్రాలకు ఖర్చుపెట్టే ఆర్థిక స్థోమత లేని వారి పరిస్థితి దయనీయంగానే ఉంటుంది. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని ఓ రైతు పరిస్థితి.
వెలిచాల గ్రామంలో గాదె రాములు తమకున్న 20 గుంటల భూమిలో వేరుశనగ సాగు చేస్తున్నారు. ఎడ్లు లేకపోవటంతో తాత గాదె రాములు, మనవడితో కలిసి దౌర కొడుతున్నారు. కాడెడ్లు లేక వ్యవసాయానికి ట్రాక్టర్లు ఉపయోగిస్తుండటంతో చిన్న చిన్న పనులకు ఇలా తాత మనవడు కాడెడ్ల స్థానంలో శ్రమిస్తున్నారు. లక్షలు పెట్టి కాడెద్దులు కొనే స్థోమత తమకు లేదని వారు వాపోతున్నారు. సెలవు రోజు రాగానే మనవడు సాత్విక్ వ్యవసాయంలో సాయం చేస్తున్నాడు. దీనితో తోటి రైతులు ఈ ఇద్దరి పట్టుదలను విశేషంగా చర్చించుకుంటున్నారు.