ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇకపై మైనర్లకు వాహనాలిస్తే.. తల్లిదండ్రులకు జరిమానా.. - ఏపీలో రోడ్డు ప్రమాదాలు

మైనర్లకు వాహనాలిస్తే తల్లిదండ్రులకు కూడా జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అతివేగం, హెల్మెట్, లైసెన్సు లేకపోవడం, ట్రిపుల్‌ రైడింగ్, మద్యం మత్తులో కొందరు వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘించే వారిలో ఎక్కువ మంది మైనర్లు, యువకులే ఉంటున్నారని ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నారు.

police
police

By

Published : May 24, 2022, 5:16 AM IST

విజయవాడలో జరిగే రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ శాతం ద్విచక్ర వాహనాల కారణంగానే జరుగుతున్నాయి. గత ఏడాది గణాంకాలను పరిశీలిస్తే... 26 శాతం ద్విచక్ర వాహనాల వల్ల, కార్లు, నాలుగు చక్రాల వాహనాల కారణంగా.. 19 శాతం, బస్సుల కారణంగా 13 శాతం, లారీల వల్ల 31 శాతం ప్రమాదలు జరిగాయి. ప్రమాదాలు ప్రాణాలు కోల్పోతున్న వారిలో ఎక్కువ మంది తలకు గాయం కావడం వల్లేనని అధికారులు అంటున్నారు. హెల్మెట్‌ వినియోగిస్తే.. ప్రాణం దక్కే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు. వాహనం నడుపుతూ ప్రమాదంలో మరణించిన వారి గణాంకాలను పరిశీలిస్తే.. బైక్‌లు నడిపే వారే 77 శాతం మంది ప్రమాదాలలో చనిపోయారు. ఆటోలు.. 3 శాతం, కార్లు, నాలుగు చక్రాల వాహనాలు.. 10 శాతం ఉంటున్నాయి.

ఇకపై మైనర్లకు వాహనాలిస్తే.. తల్లిదండ్రులకు జరిమానా..

యువకులు స్పోర్ట్స్ బైక్‌లపై నగరంలోనే 80 నుంచి 100 కి.మీ వేగంతో దూసుకెళ్తున్నారు. రాత్రి వేళల్లో అయితే వేగానికి అంతే లేదు. పోలీసులు ఎన్ని చలానాలు రాస్తున్నా, జరిమానాలు విధిస్తున్నా మార్పు రావడం లేదు. యువకులు బైక్‌ రేసులు, ర్యాష్‌ డ్రైవింగ్ తో ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. చాలా మంది నిర్ణీత వయసు లేకుండానే వాహనాలను నడుపుతున్నారు. డ్రైవింగ్‌ లైసెన్సులు కూడా ఉండడం లేదు. పలువురు 350 సీసీ బైకులు, స్పోర్ట్స్‌ బైకులనూ నడుపుతూ తోటి వాహనదారులను బెంబేలెత్తిస్తున్నారు. స్పోర్ట్స్‌ బైక్‌లతో పందేలు పెట్టుకుంటూ హడలెత్తిస్తున్నారు. వీటికి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, బీఆర్‌టీఎస్‌ రోడ్లు వేదికలవుతున్నాయి. అయితే ఇటువంటి వారిని చట్టపరంగా శిక్షిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.

తనిఖీల్లో పట్టుకున్న యువకులతోపాటు... వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది మైనర్లు, యువకులే ఉండటం వల్ల తల్లిదండ్రులను గట్టిగా హెచ్చరించి పంపిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చాలా చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు.

నిర్ణీత వయసు రానిదే వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. 16 ఏళ్లు నిండితే గేర్‌లెస్, 18 ఏళ్లు నిండితే గేర్‌ వాహనాలు నడిపేందుకు లైసెన్సులు తీసుకోవాలంటున్నారు.

ఇదీ చదవండి:తెల్లారితే పెళ్లి.. అంతలోనే వరుడు అరెస్ట్.. ఏం జరిగింది..?

ABOUT THE AUTHOR

...view details