జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు ఎట్టకేలకు పోలీసులు అనుమతించారు. అంతకు ముందు ఆవిర్భావ సభకు పోలీసులు అనుమతి నిరాకరించినట్టు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. సభకు ప్రభుత్వం ఆటంకాలు కల్పించడం సరికాదని మండిపడ్డారు. రేపటిలోగా అనుమతివ్వకుంటే హైకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. మార్చి 14న తాడేపల్లి మండలం ఇప్పటంలో నిర్వహించనున్న సభ కోసం ఏర్పాటు చేసిన 12 కమిటీలతో ఏర్పాట్లపై నాదెండ్ల చర్చించారు. పోలీసులు సభకు అనుమతి ఇవ్వకపోయినా నిర్వహించి తీరుతామని తేల్చి చెప్పారు. మనోహర్ మీడియా సమావేశం తర్వాత కాసేపటికే సభకు అనుమతించినట్టు పోలీసులు తెలిపారు. సందర్భంగా కాకినాడ గ్రామీణ ప్రాంతానికి చెందిన వివిధ పార్టీల నేతలు మనోహర్ సమక్షంలో జనసేనలో చేరారు.
"సభ నిర్వహణ కోసం 3 ప్రాంతాలు మారాల్సి వచ్చింది. చివరికి ఇప్పటం గ్రామంలో ఉన్న రైతులు ధైర్యంగా ముందుకొచ్చి మంచి హృదయంతో సభ నిర్వహణ కోసం స్థలం ఇచ్చారు. వైకాపా నాయకులు బెదిరించినా లెక్కచేయకుండా జనసేనకు సహకరించారు. సీఎం జగన్ వైఖరి, ఆలోచన చాలా విచిత్రంగా ఉంటోంది. సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు సీఎంకు సన్మానం చేసేందుకు సిద్ధమవుతుండటం కామెడీ సీన్‌లా ఉంది. ఏపీలోని పేదలంతా ఒక్కసారిగా ధనవంతులయ్యారని టికెట్ల ధరలు పెంచారు. రూ.7 లక్షల కోట్లు అప్పుతెచ్చి వారిని ధనవంతుల్ని చేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా.. సంక్షేమం పేరుతో దోపిడీ విపరీతంగా జరిగింది. జనసైనికులు, వీరమహిళలతో దయచేసి పెట్టుకోవద్దు. చాలా బలమైన శక్తి మా పార్టీలో వాళ్లే. పవన్ కల్యాణ్ నాయకత్వం కోసం యువత, మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు" -నాదెండ్ల మనోహర్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్