Chalo Vijayawada: పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు రేపు 'చలో విజయవాడ'కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. విజయవాడ నగరంలో ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించారు. చలో విజయవాడ ర్యాలీకి పోలీసులు ఇప్పటికే అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే, గురువారం బీఆర్‌టీఎస్ రోడ్డుపై వాహన రాకపోకలను నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. రేపు ఉదయం 5గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు వాహన రాకపోకలకు అనుమతిలేదని స్పష్టం చేశారు. మళ్లింపు మార్గాల్లోనే వాహనదారులు ప్రయాణించాలని సూచించారు. అటువైపుగా వాహన రాకపోకల్ని నిలువరిస్తూ ఆరు మళ్లింపు మార్గాలు ఏర్పాటు చేసినట్టు సమాచారం.
ఉద్యోగులపై పోలీసుల నిఘా.. ఎక్కడికక్కడ అడ్డుకొనేందుకు ప్రయత్నం!
చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించేందుకు పీఆర్సీ సాధన సమితి నేతలు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యారు. నేతలంతా నగర పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చి ఉన్నతాధికారులను కలిశారు. సీపీతో నేరుగా హాజరు కాలేదని నేతలు చెబుతున్నారు. సీపీని కలిసేందుకు వచ్చినప్పటికీ కొన్ని కారణాల రీత్యా ఆయన కలవలేదని తెలుస్తోంది. ఎట్టిపరిస్థితుల్లో ‘చలో విజయవాడ’ కార్యక్రమం నిర్వహించి తీరుతామని నేతలు స్పష్టం చేస్తున్నారు. 13 జిల్లాల నుంచి ఉద్యోగులు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. నిన్న రాత్రి నుంచి ఎక్కడికక్కడ ఉద్యోగ సంఘాల నేతలను గృహనిర్బంధంలో ఉంచుతున్నారు. అలాగే, బస్టాండ్లు, ట్యాక్సీ స్టాండ్లు, రైల్వే స్టేషన్‌లలోనూ పోలీసులు నిఘా ఉంచారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి గుంటూరు మీదుగా విజయవాడకు వచ్చే వారందరినీ అడ్డుకొనేందుకు వీలుగా కాజ టోల్ గేటు వద్ద; అలాగే, వారధి వద్ద మరో పికెట్‌ని ఏర్పాటు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయగోదావరి జిల్లాల నుంచి వచ్చే ఉద్యోగులను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పీఆర్సీ సాధన సమితి ముఖ్య నేతలపై నిఘా ఉంచిన పోలీసులు వారి ఇళ్లకు వెళ్లి నోటీసులు అంటించే ప్రయత్నం చేస్తున్నారు. చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించేందుకు నేతలు బీఆర్‌టీఎస్ వద్ద నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. దీంతో అక్కడ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిఘా కెమెరాలు పెట్టారు. చలో విజయవాడ నిర్వహించేందుకు చేసే అన్నిప్రయత్నాలను అడ్డుకొనేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా తమ కార్యాచరణ కొనసాగిస్తామని పీఆర్సీ సాధన సమితి నేతలు చెబుతున్నారు.