Police checkings: యూటీఎఫ్ ఆందోళన నేపథ్యంలో సామాన్య ప్రజలకు.. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. తనిఖీల పేరుతో ప్రజలను పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వివిధ పనుల్లో భాగంగా బయటకు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. గుర్తింపు కార్డు చూపాలని ప్రజలపై ఒత్తిడి చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. జంక్షన్ కూడలి నుంచి విజయవాడ వైపు వెళ్లే అన్ని వాహనాలను పోలీసులు మళ్లింపు చేస్తున్నారు.
ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ గేట్ వద్ద పోలీసులు ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆసుపత్రికి వెళ్తున్నామని చెబుతున్నా... పోలీసులు పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ తీరుపై సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నూజివీడులో భారీ బందోబస్తు..సీఎంవో ముట్టడి పిలుపు నేపథ్యంలో నూజివీడులో పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడకు వెళ్లే బస్సులను మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిలిపివేశారు. విజయవాడ మినహా మిగతా ప్రాంతాలకు యథావిధిగా బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. విజయవాడకి వెళ్లే బస్సులను నిలిపివేయడంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముందుస్తుగా రిజర్వేషన్ చేసుకుని వచ్చామని... తీరా బస్టాండ్‌కి వచ్చాక బస్సులు నిలిపివేశామని చెబుతున్నారని వాపోతున్నారు. మరోవైపు నూజివీడు రైల్వేస్టేషన్ లో పోలీసుల విస్తృత తనిఖీలు చేపట్టారు. కాకినాడ నుంచి విజయవాడ వెళుతున్న కాకినాడ ఫాస్ట్ రైలులో ప్రతి భోగీ తనిఖీ చేశారు.