విజయవాడ నగరంలో 470 మంది రౌడీషీటర్లు, సుమారు 350 మంది వరకు సస్పెక్ట్ షీటర్లు ఉన్నారు. వీరిని వారానికోసారి సంబంధిత స్టేషన్‌కు, టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి పిలిచి పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కొవిడ్ కారణంగా ఈ ప్రక్రియకు ఆటంకం కలిగింది. తాడేపల్లిలో జరిగిన సామూహిక అత్యాచార ఘటన తర్వాత.. రౌడీషీట్ ఉన్నవారితో పాటు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్‌లను కూడా పిలిపించి కౌన్సెలింగ్ చేస్తున్నారు. ఏదైనా ఘటన జరిగిన తర్వాత హడావుడి చేయడం కాకుండా.. దీన్ని నిరంతరం నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు భావిస్తున్నారు.
ఇటీవల సంచలనం రేపిన వ్యాపారవేత్త రాహుల్ హత్య కేసులో రౌడీషీటర్ కోగంటి సత్యం సూత్రధారి అని పోలీసులు తేల్చారు. రెండేళ్ల క్రితం కూడా చాలా నెలల పాటు కోగంటి కౌన్సెలింగ్‌కు హాజరుకాలేదు. తర్వాత హైదరాబాద్‌లో జరిగిన రామ్‌ప్రసాద్ హత్య కేసులోనూ ప్రమేయం ఉందని తేలిన తర్వాతే పోలీసులు మేల్కొన్నారు. విజయవాడలో రెండు నెలల క్రితం దుర్గ అగ్రహారంలో పట్టపగలు జరిగిన హత్య సంచలనం సృష్టించింది. ఇందులో ప్రధాన నిందితుడిపై సస్పెక్ట్ షీట్ ఉంది. క్షేత్రస్థాయిలో నిఘా మరింత పెంచాల్సిన అవసరాన్ని ఈ ఘటనలు చెబుతున్నాయి.