ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పది పరీక్షల్లో గందరగోళం.. ఉత్తీర్ణత లక్ష్యాలతోనే.. పరీక్షల్లో అక్రమాలు ..! - Tenth Exam Question paper Leakage issue

Tenth class question paper leaked before the exam
Tenth class question paper leaked before the exam

By

Published : May 3, 2022, 5:55 PM IST

Updated : May 4, 2022, 5:49 AM IST

17:49 May 03

పరీక్షకు ముందే పదవ తరగతి ప్రశ్నాపత్రం లీక్...ఆ తర్వాత వాట్సాప్ డిలీట్...

పది పరీక్షల్లో గందరగోళం.. ఉత్తీర్ణత లక్ష్యాలతోనే.. పరీక్షల్లో అక్రమాలు ..!

Tenth Exam Question paper Leakage: పదో తరగతి పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌, ప్రశ్నపత్రాల లీకేజీలు.. ప్రతిభావంతుల ఆశయాలు, లక్ష్యాలను గండికొడుతున్నాయి. బాగా చదివి మంచి మార్కులతో ప్రతిభ చూపాలనుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులు మానసిక వేదనకు గురవుతున్నారు. ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఉపాధ్యాయులే ఈ అక్రమాలకు పాల్పడుతున్నారనే అనుమానాలు రేకెత్తున్నాయి. ఉన్నతాధికారులు విధించే అసంబద్ధ లక్ష్యాలు చేరుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లోనే మాస్‌ కాపీయింగ్‌ చేయిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

SSC Exams in AP: పదో తరగతి పరీక్షల్లో ఎన్నడూ చూడని విధంగా అక్రమాలు చోటుచేసుకుంటుండటం.. చర్చనీయాంశమైంది. అడ్డదారులు తొక్కుతున్న ఉపాధ్యాయులు, అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్షలు రాసే విద్యార్థులు వారి సొంత పిల్లలు కాదు. వారి బంధువుల పిల్లలూ కాదు. ధనవంతుల కుటుంబాలకు చెందినవారా? డబ్బులు ఇస్తారా..? అంటే అదీ లేదు. అయినా వారిని ఉత్తీర్ణులు చేయించేందుకు ఉపాధ్యాయులు ఎందుకు మాస్ కాపీయింగ్ చేయిస్తున్నారనే ప్రశ్న తొలచి వేస్తోంది. ప్రశ్నపత్రాల లీకేజీ, మాస్‌ కాపీయింగ్ ఘటనల్లో పట్టుబడి సస్పెన్షన్లకు గురవుతున్నా.. జైళ్లకు వెళ్తున్నా భయపడకుండా ఎందుకు అక్రమాలు చేస్తున్నారు? తరగతి గదిలో బోధన చేసే ఉపాధ్యాయులు ఎందుకు మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు? దీనికంతటికీ కారణం ఉన్నతాధికారులు విధిస్తున్న అసంబద్ధ లక్ష్యాలే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గత కొన్నేళ్లుగా వ్యవస్థీకృతమైపోయిన ఈ ప్రక్రియ ఇప్పుడు పతాకస్థాయికి చేరింది. ఈ పరిస్థితిని బట్టి.. ఉపాధ్యాయులు ఎంత ఒత్తిడికి గురవుతున్నారో అర్థమవుతోంది. ఫలితాల్లో తేడా వస్తే.. ఉపాధ్యాయులనే బాధ్యులను చేస్తున్నారు. తరగతి గదిలో బోధన, విద్యార్థులు ఎంత వరకు నేర్చుకున్నారు అనేవి ఎలా ఉన్నా పట్టించుకోవడం లేదు. పాఠ్య ప్రణాళిక పూర్తయిందా, ఫలితాలు వంద శాతం వచ్చాయా అనే దాన్ని మాత్రమే అధికారులు పరిశీలిస్తున్నారు. దీంతో తమ విద్యార్థులను వంద శాతం ఉత్తీర్ణత చేయించాలనే తాపత్రయంతో ఉపాధ్యాయులు అక్రమాలకు పాల్పడుతున్నారు. నాణ్యమైన బోధన, విద్యార్థులను సన్నద్ధత చేయడం కంటే... పరీక్షల సమయంలో మాస్‌ కాపీయింగ్ చేయిస్తే సరిపోతుందనే భావన వ్యక్తమవుతోంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పటి వరకు జరిగిన పరీక్షల్లో 52మందిపై కేసులు నమోదు కాగా.. 38మంది ఉపాధ్యాయులు సస్పెండ్‌ అయ్యారు. పాఠశాల స్థాయిలో నిర్వహించే యూనిట్‌ టెస్ట్‌ పరీక్షల కంటే పది పరీక్షలు దారుణంగా తయారయ్యాయి.

జాతీయ సాధన, జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(NCERT) సర్వేల ప్రకారం విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు ఉండడం లేదు. 3, 5, 8 తరగతులతోపాటు పదో తరగతి విద్యార్థులు బేసిక్స్‌ చెప్పలేకపోతున్నారు. తెలుగు తప్పులు లేకుండా రాయలేని పరిస్థితి. నూతన విద్యా విధానం అమలు కోసం పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారమే... పదో తరగతిలో గణితం, సామాన్యశాస్త్రంలో విద్యార్థి సగటు పనితీరు 41శాతంగా మాత్రమే ఉంది. సాంఘికశాస్త్రం, ఆంగ్లం, తెలుగులో 43శాతంగా మాత్రమే ఉంది. కానీ, 2019లో పదో తరగతి ఫలితాల్లో 95శాతం మంది ఉత్తీర్ణ సాధించారు. ఇది ఎలా సాధ్యమవుతోంది? ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసినా దీనిపై ఎప్పుడూ సీరియస్‌గా సమీక్షించడం లేదు.

విద్యార్థుల్లోని లోపాలను సరి చేసి, వారిలో సామర్థ్యాలను పెంచేందుకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. లోపాలను గుర్తించిన వెంటనే పిల్లల ప్రతిభను మెరుగుపరిస్తే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. పదో తరగతి ఉత్తీర్ణులైనా ఇంటర్మీడియట్‌లో మధ్యలోనే మానేస్తున్నారు. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత 65శాతంలోపే ఉంటోంది. గతంలో మాస్‌కాపీయింగ్‌ చేస్తూ విద్యార్థుల ఇంత మంది పట్టుబడ్డారని అధికారులు గణాంకాలు విడుదల చేసేవారు. ఇప్పుడు ఉపాధ్యాయులు, ప్రైవేటు వ్యక్తులపై కేసులు, సస్పెన్షన్‌లు చేస్తున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించలేదు. ఈసారీ విద్యార్థులందర్నీ ఉత్తీర్ణులు చేసేందుకు ప్రశ్నపత్రాల లీకేజీ, మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారు.

గుజరాత్‌లో గత కొన్నేళ్లుగా పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆడియో రికార్డింగ్‌ సదుపాయం వీటికి ఉంటోంది. ఫలితాలు వచ్చే ముందు ఫుటేజీలను పరిశీలిస్తారు. 2016-18 నుంచి 2019-20 వరకు సరాసరిన ఆ రాష్ట్రంలో ఉత్తీర్ణత కేవలం 67.56శాతం మాత్రమే. అదే ఏపీకి వచ్చేసరికి సరాసరి ఉత్తీర్ణత 93.67శాతంగా ఉంది. 2017లో రాష్ట్రంలోని కొన్ని కేంద్రాల్లో సీసీకెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీకెమెరాలు ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఉత్తీర్ణత దారుణంగా పడిపోయింది. అనంతపురం జిల్లా యెల్లనూరు కేంద్రంలో కెమెరాలు ఉన్న గదిలో కేవలం 54.85శాతం మంది ఉత్తీర్ణులైతే పక్కనే ఉన్న మరో గదిలో 89.45శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా ఎల్బీచర్లలో సీసీ కెమెరాలు ఉన్నగదిలో 32.6శాతం, కెమెరాలు లేని గదిలో 52.8శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత నుంచి అసలు సీసీ కెమెరాల ఏర్పాటునే మూలకు పడేశారు. రహదారులపై పోలీసులు సీసీకెమెరాలు ఏర్పాటు చేసి, పర్యవేక్షిస్తున్నట్లే కేంద్రాల్లో వద్ద పర్యవేక్షణ చేస్తే చూచిరాతలు, లీకేజీలు ఎందుకు జరుగుతాయన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

పైనుంచి కింది స్థాయి వరకు నెలకొన్న ఉదాసీనతే దీనికి కారణంగా నిలుస్తోంది. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా, అసోమ్‌లాంటి రాష్ట్రాలు కూడా పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇంత పెద్ద రాష్ట్రంలో ఎందుకు వీటిని పట్టించుకోరని..... విద్యపై భారీగా ఖర్చు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం వీటిపై ఎందుకు దృష్టి సారించడం లేదని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో ఏర్పాటు చేస్తే 30కోట్ల వరకు వ్యయమవుతుందనే అధికారిక అంచనా ఉంది. ఇంత స్వల్పం మొత్తం వ్యయంపై అధికార యంత్రాంగం దృష్టిపెట్టడం లేదు. ఒకసారి కొనుగోలు చేస్తే కొన్నేళ్లపాటు ఇవి ఉపయోగపడతాయి.

విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంచి, నాణ్యమైన తరగతి గది బోధనతో ఫలితాలు సాధించాల్సి ఉండగా.. ఇవేవీ పట్టించుకోకుండా ఫలితాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వ్యవస్థ గాడితప్పుతోంది. పరీక్షల ముందు సమీక్షల్లో ఫలితాలు రాకపోతే చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ల హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జిల్లాల మధ్య పోటీ పెడుతున్నారు. దీంతో కొందరు ఉపాధ్యాయలు విద్యార్థులందర్నీ ఉత్తీర్ణులు చేయించేందుకు మాస్‌ కాపీయింగ్‌కు సహకరిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో కొన్ని కేంద్రాల్లో కొంతమంది ఇన్విజిలేటర్లు విద్యార్థుల వద్దకు వెళ్లి, ఏం సమాధానాలు రాశావు? ఏమైనా కావాలా? అని అడుగుతున్నట్లు విద్యార్థులు వెల్లడిస్తున్నారు. ఇలాంటి పరీక్షలు ఎందుకు నిర్వహించడమని బాగా సన్నద్ధమైన పిల్లలు.. తల్లిదండ్రుల వద్ద వాపోతున్నారు.

ఆ సమయంలో పిల్లలు, తల్లిదండ్రులు పడే మానసికవేదన ఎవ్వరికీ పట్టడం లేదు. ప్రతిభను ప్రోత్సహించాలనే అంశాన్ని పట్టించుకోవడం లేదు. ఆంగ్ల భాష పరీక్ష రోజున నంద్యాల జిల్లా నందికొట్కూరులో ప్రశ్నపత్రం లీకేజీ, మాస్‌కాపీయింగ్‌ జరగలేదని మంత్రి, అధికారులు ప్రకటించారు. కానీ, పోలీసులు మాత్రం మాస్‌ కాపీయింగ్‌ వ్యవహరంలో ఆరుగుర్ని అరెస్టు చేశారు. మాస్‌కాపీయింగ్‌ జరక్కపోతే ఇక్కడ ఇంతమందిని ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నిస్తున్నారు. దీంతో అధికారుల ప్రకటనల డొల్లతనం బయటపడింది.

కొన్ని పరీక్ష కేంద్రాల్లో ప్రశ్నపత్రాలను వాట్సప్‌ల్లో బయటకు పంపించి, సమాధానాలను విద్యార్థులకు అందిస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో మాస్‌ కాపీయింగ్‌కు పిల్లల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు ఉన్నాయి. మరికొన్నిచోట్ల బయట వ్యక్తులతో కిటికీల్లో నుంచి చిట్టీలు వేయిస్తున్నారు. అక్కడ విధుల్లో ఉన్న వారికి కొంతమొత్తం ముట్టచెప్పుతున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144సెక్షన్‌ అమల్లో ఉంటుంది. ప్రైవేటు వ్యక్తులు ఎవ్వరూ అక్కడికి వెళ్లేందుకు అవకాశం ఉండదు. ప్రశ్నపత్రాలు ఎలా బయటకు వస్తున్నాయనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. కేంద్రాల్లోకి ఫోన్లు తీసుకువెళ్లడాన్ని నిరోధించడంలో అధికార యంత్రాంగం విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి.

ఇప్పటివరకు తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం పరీక్షలు నిర్వహించగా.. అన్ని పేపర్లు పరీక్ష సమయంలోనే బయటకు వచ్చేశాయి. భారీగా మాస్‌కాపీయింగ్‌ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఉత్తీర్ణత శాతం పెంచాలనే ఉద్దేశంతో అన్ని స్థాయిల్లోనూ చూసీచూడనట్లు ప్రవర్తించడమే కారణమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల తెలిసిన ఇన్విజిలేటర్‌ను గదిలో వేయించుకుని, ప్రశ్నపత్రం విద్యార్థులకు అందించే సమయంలో వాట్సప్‌లో పంపిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ప్రైవేటు యాజమాన్యాలు, కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు కుమ్మక్కై అక్రమాలకు తెర తీస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

Last Updated : May 4, 2022, 5:49 AM IST

ABOUT THE AUTHOR

...view details