PM Modi in ICRISAT: ఇక్రిశాట్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు హాజరైన ప్రధాని మోదీ.. అక్కడే ఉన్న శనగల మొక్కలను పరిశీలించారు. వెంటనే వాటి నుంచి శనగలను తెంచుకుని ఆరగించారు. ఇదంతా ప్రధానితో పాటు అక్కడ ఉన్న శాస్త్రవేత్తలు ఆసక్తిగా తిలకించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దేశ ప్రధాని.. ఒక సాధారణ వ్యక్తిలా అలా శనగల తినడం ఆశ్చర్యపరుస్తోందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోకు తెగ కమెంట్స్ పెడుతున్నారు.
తోటల్లో తిరిగిన మోదీ..
ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఇక్రిశాట్‌లోని తోటల్లో కలియతిరిగారు. స్వయంగా వాటిని పరిశీలించారు. వాటి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సజ్జ, కంది, సెనగ, వేరుసెనగ, ఇతర చిరుధాన్యాలు విత్తన రకాలు, నాణ్యతపై ప్రధాని తెలుసుకున్నారు. ప్రధానిని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ జాక్వెలిన్ డి ఆరోస్ సన్మానించారు. ఇక్రిశాట్ పరిశోధనలు పురోగతిపై ప్రధానికి శాస్త్రవేత్తలు వివరించారు. ఇక్రిశాట్‌లో క్లైమేట్ చేంజ్ రీసెర్చ్ ఫెసిలిటీని, రాపిడ్ జెన్ రీసెర్చ్ ఫెసిలిటీని ప్రధాని మోదీ ఆయన చేతులమీదుగా ప్రారంభించారు.