ఇంద్రకీలాద్రిపై పర్యావరణానికి హానిచేసే ప్లాస్టిక్ సంచులను నిషేధిస్తున్నామంటూ ఆలయ అధికారులు చేసిన ప్రకటనలు మాటలకే పరిమితమయ్యాయి. కొండపై పూజా సామగ్రి విక్రయించే దుకాణాల్లో మాత్రం ఎటు చూసినా ప్లాస్టిక్ సంచులే దర్శనమిస్తున్నాయి.
గత నెల 20 నుంచి ఇంద్రకీలాద్రిపై ప్లాస్టిక్ సంచులను నిషేధిస్తున్నామని తెలిపిన ఆలయ అధికారులు... తదనుగుణంగా విస్తృత ప్రచారమూ చేశారు. విజయవాడలో ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ సంచులను వ్యాపారస్తులందరూ నిషేధించగా ఇంద్రకీలాద్రిపై మాత్రం ఇది అమలు కావట్లేదు.
దుర్గామల్లేశ్వర దేవస్థానానికి భక్తులు నిత్యం వేల సంఖ్యలో తరలివస్తుంటారు. పండుగ వేళల్లో భక్తుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇంద్రకీలాద్రిపై ప్లాస్టిక్ నిషేధం తప్పని సరి చేస్తూ... అధికారులు ప్రకటన జారీ చేశారు. కొండపైకి ప్లాస్టిక్ సంచులు తీసుకొస్తే జరిమానా తప్పదని హెచ్చరించినా... ప్లాస్టిక్ వినియోగం మాత్రం అదుపులోకి రావట్లేదు.