కొవిడ్ నోడల్ కేంద్రమైన తెలంగాణలోని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ప్లాస్మా థెరపీ సత్ఫలితాలిస్తోంది. ప్రాణాపాయస్థితిలో ఉన్న బాధితునికి రెండు సార్లు ప్లాస్మా ఎక్కించడం వల్ల కోలుకుంటున్నాడు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ఐసీఎంఆర్ ) మార్గదర్శకాల ప్రకారంగా.. దాతల నుంచి సేకరించిన ప్లాస్మాను గాంధీ ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్‌లో మైనస్ 18 డిగ్రీల సెల్సియస్ ఫ్రీజర్ బాక్సుల్లో భద్రపరిచారు.
సుమారు 16 మంది కరోనా బాధితులు ఆక్సిజన్‌పై ఉండగా వారిలో ఆరుగురిని ప్లాస్మా థెరపీ కోసం ఎంపిక చేసి ఐసీఎంఆర్‌కు పంపారు. అక్కడి ఆదేశాలతో ప్లాస్మా థెరపీని ప్రారంభించారు. పాతబస్తీకి చెందిన ఒకే బాధితునికి రెండు సార్లు ప్లాస్మాను ఎక్కించారు. ఐసీఎంఆర్ నిబంధన ప్రకారం.. ప్లాస్మా ఎక్కించిన తర్వాత బాధితుడు కోలుకుంటున్న క్రమంలో రెండో డోస్ ఎక్కించాలి. మొదటి డోస్ ప్లాస్మా ఎక్కించినా పురోగతి లేకుంటే ఈ రకమైన చికిత్స ఎటువంటి ప్రభావం చూపట్లేదని భావించి రెండో డోస్ ఇవ్వరు.